Weather Forecast: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రధానంగా ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావం కారణంగా ఈ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ నెల సెప్టెంబర్ 26న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. 27న అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు: దక్షిణ ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భల మీదుగా దక్షిణ మరాఠ్వాడ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే ఉత్తర అండమాన్ సముద్రం నుంచి దక్షిణ బంగాళాఖాతం, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటకల మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు మరో ద్రోణి విస్తరించి ఉంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
మూడు రోజుల వాతావరణ అంచనాలు: ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఆదివారం కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి. సోమవారం సైతం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఎల్లో అలర్ట్ జారీ: ఈ మూడు రోజులు కూడా ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలో వర్షాలు.. అల్పపీడనం హెచ్చరిక: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
పిడుగుల హెచ్చరిక: ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


