Mohd Azharuddin as Minister of Telangana: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేబినెట్‌లోకి కొత్త మంత్రి రాబోతున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కనున్నట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను కేబినెట్‌లో చేర్చుకోవాలని నిర్ణయించింది. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారోత్సవం ఎల్లుండి (అక్టోబర్ 31)న జరగనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర కేటినెట్‌లో చోటు దక్కించుకున్న మొదటి మైనార్టీ వ్యక్తిగా అజారుద్దీన్ నిలువనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఎమ్మెల్సీ నామినేషన్‌ను రద్దు చేసిన తర్వాత, ఈ ఏడాది ఆగస్టులో గవర్నర్ కోటా కింద అజారుద్దీన్‌ను లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఎంఎల్సీ) పదవికి ప్రభుత్వం ప్రతిపాదించింది. అజారుద్దీన్ సెప్టెంబర్ 1న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందు అనూహ్యంగా..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంపై చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ పరిధిలోని ముస్లిం మైనార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెట్ స్టార్ అయిన అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా జూబ్లీహిల్స్ బై-ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరనుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం ముస్లిం ఓటర్లే 1.2 లక్షల మంది ఉంటారు. వీరి మద్దతు కూడగట్టడంలో ఈ నిర్ణయం బాగా పనిచేస్తుందని అధిష్టానం భావిస్తోంది. కాగా, జూబ్లీహిల్స్ టికెట్ కోసం అజారుద్దీన్ అన్ని ప్రయత్నాలు చేశారు. తొలుత తనకే టికెట్ వస్తుందని భావించారు. అయితే, అనూహ్యంగా నవీన్ యాదవ్‌కు టికెట్ కేటాయించడంతో ఆయన నిరాశకు గురయ్యారు. ఎట్టకేలకు, అధిష్టానంతో లాబీయింగు తర్వాత ఆయన మంత్రి పదవి దక్కించుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజరుద్దీన్‌కు తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. గతంలో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇక, ప్రస్తుతం ప్రమాణ స్వీకార సమయం ఇంకా అధికారికంగా ప్రకటించబడనప్పటికీ, రాజ్‌భవన్‌లో ఉదయం లేదా మధ్యాహ్నం మధ్య ఈ కార్యక్రమం జరగే అవకాశం ఉంది.
అజారుద్దీన్ రాజకీయ, క్రీడా నేపథ్యం..
మహ్మద్ అజారుద్దీన్ రాజకీయ జీవితం 2009లో కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైంది. ఆ ఏడాదే ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే, తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. క్రికెట్ రంగంలో అజారుద్దీన్ 1984 నుంచి 2000 మధ్య కాలంలో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడి భారత జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. క్రికెట్‌లో 47 టెస్టుల్లో, 62 వన్డేల్లో సెంచరీలు సాధించిన రికార్డు ఆయన సొంతం.


