Montha Effect Flash Floods: మొంథా తుపాను తీరం దాటేసింది. క్రమంగా వాయుగుండంగా బలహీనపడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్శాపురం సమీపంలో తీరం దాటిన అనంతరం క్రమంగా తెలంగాణవైపుకు పయనిస్తోంది. ఈ క్రమంలో మధ్య కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాలకు హెచ్చరిక జారీ అయింది. రానున్న 24 గంటలు కీలకమని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది
మొంథా తుపాను తీరం దాటిన తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. తీరం దాటిన పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు పొరుగు జిల్లాలైన కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం సాధారణం నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఐఎండీ హెచ్చరించినట్టుగా భారీ వర్షాలు, ఈదురు గాలులు కన్పించలేదు. కానీ తీరం దాటిన తరువాత క్రమంగా వాయుగుండంగా బలహీనమౌతున్న తుపాను తెలంగాణ, విదర్భ వైపుకు పయనిస్తోంది. ఈ క్రమంలో మధ్య కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు, పశ్చిమ, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోనూ, మధ్య కోస్తాంధ్ర పరిధిలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయనేది ఐఎండీ తాజాగా చేస్తున్న హెచ్చరిక.
హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో నాన్‌స్టాప్ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్
ఇక తెలంగాణ వెదర్‌మ్యాన్ సంస్థ హెచ్చరికలు ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ ప్రజల్ని కలవరపెడుతున్నాయి. తెలంగాణలోని అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్ధిపేట, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి, పెద్దపల్లి జిల్లాలు సహా తూర్పు, ఉత్తర హైదరాబాద్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు పడతాయని తెలిపింది. ఫలితంగా ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఈ సూచనలకు అనుగుణంగానే హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి.


