Telanagana Crime: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొత్తం కలవరపరిచిన డబుల్ మర్డర్ మిస్టరీ చివరకు బయటపడింది. సినిమా కథను తలపించే ఈ కేసులో కన్న తల్లే కూతురిని, అంతకు ముందే భర్తను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. కవిత అనే మహిళ తనకంటే వయసులో సగం తక్కువ వయసున్న రాజ్‌కుమార్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఈ ఘోర హత్యలు చోటు చేసుకున్నాయి.
నిమ్మకాయలు, పసుపు, కుంకుమ..
ఈ సంఘటనల పరంపరలో మొదటగా బయటపడినది వర్షిణి అనే యువతి హత్య. గత ఆగస్టు 25వ తేదీన కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో వర్షిణి మృతదేహం లభ్యమైంది. ఆ శవం పక్కనే నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లిన ఆనవాళ్లు కనపడటంతో మొదట క్షుద్రపూజల అనుమానం వ్యక్తమైంది. గ్రామస్థులు యువతిని బలి ఇచ్చారని అనుకున్నారు. కానీ పోలీసులు కేసును లోతుగా విచారించడంతో నిజం మరోలా వెలుగులోకి వచ్చింది.
అనుమానాస్పద స్థితుల్లో..
వర్షిణి తండ్రి కుమారస్వామి జూన్ 25న అనుమానాస్పద స్థితుల్లో మరణించాడు. ఆ సమయంలో అతడు అనారోగ్యంతో చనిపోయాడని కుటుంబానికి, గ్రామానికి మృతుని భార్య కవిత చెప్పింది. అంత్యక్రియలు కూడా త్వరగా జరిపించింది. కానీ తన తండ్రి మరణం పై వర్షిణికి అనుమానం కలిగింది. ఆమె తన తల్లిని ప్రశ్నించడంతో కవిత భయపడింది. తన రహస్యాన్ని బయటపెట్టవచ్చని అర్థం చేసుకుని కూతురిని కూడా చంపాలని ప్రణాళిక వేసింది.
తన ప్రియుడు రాజ్‌కుమార్ సహాయంతో కవిత దారుణమైన పథకం రచించింది. ఆగస్టు 2న వర్షిణిని చంపి మృతదేహాన్ని సంచిలో పెట్టి గ్రామం శివారులోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక చెట్ల మధ్య దాచిపెట్టారు. ఆ తరువాత 6వ తేదీన చిట్యాల పోలీస్ స్టేషన్‌లో కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది.
అయితే వర్షిణి మృతదేహాన్ని పూర్తిగా దాచలేమని భావించి మరో ప్లాన్ వేసుకున్నారు. ఆగస్టు 25న సాయంత్రం రాజ్‌కుమార్ వాహనంలో ఆ శవాన్ని తీసుకెళ్లి కాటారం సమీపంలోని అడవిలో వదిలేశాడు. అంతటితో ఆగకుండా యూట్యూబ్‌లో చూసిన క్షుద్రపూజల వీడియోలను అనుసరించి అక్కడే నకిలీ పూజా సామగ్రి పేర్చాడు. ఇలా చేస్తే దృష్టి మరలుతుందని, అసలు హత్య విషయం బయటకు రాదని భావించాడు. కానీ పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి విచారణ జరపడంతో ఈ నాటకం బయటపడింది.
వాస్తవానికి ఈ హత్యల వెనుక అసలు కారణం కవిత, రాజ్‌కుమార్ మధ్య కొనసాగిన వివాహేతర సంబంధమే. 24 ఏళ్ల రాజ్‌కుమార్‌తో కవితకు ఉన్న బంధం మొదట భర్త ప్రాణం తీసింది. తరువాత కూతురి అనుమానాలు పెరుగుతాయని గ్రహించి ఆమెను కూడా క్రూరంగా హతమార్చింది. కవిత చేసిన ప్రయత్నాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా, పోలీసుల దృష్టిని తప్పించలేకపోయింది.
పోలీసులు దర్యాప్తులో మొదట వర్షిణి మృతదేహం వద్ద కనబడిన వస్తువులపై దృష్టి పెట్టారు. శవాన్ని వేరే చోటు నుండి తీసుకువచ్చారని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, అనుమానాస్పద కదలికల ఆధారంగా కవిత, రాజ్‌కుమార్‌లపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కఠినంగా విచారించడంతో అసలు నిజం బయటపడింది.
అనారోగ్యంతో చనిపోయాడని..
పోలీసుల సమక్షంలోనే ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. కవిత తన భర్తను హతమార్చిన విషయాన్ని కూడా స్వయంగా ఒప్పుకుంది. ఆ సమయంలో భర్తను అనారోగ్యంతో చనిపోయాడని చెప్పి తప్పించుకున్నానని చెప్పింది. కానీ కూతురు వర్షిణి తనపై అనుమానం వ్యక్తం చేసినందువల్ల ఆ క్రూర నిర్ణయం తీసుకున్నానని విచారణలో వెల్లడించింది.


