MP Kiran Kumar Reddy Comments on Harish Rao: గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనంటూ బీఆర్‌ఎస్.. గత ప్రభుత్వ పాపమేనంటూ కాంగ్రెస్.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1పై వచ్చిన తీర్పుపై హారీష్ రావు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని స్పష్టంగా తెలుస్తోందని వ్యంగాస్త్రాలు సంధించారు. నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ పాలకులు అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఏం చేసిందో చెప్పాలన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది నిజం కాదా అని నిలదీశారు.
నాడు పేపర్లు అమ్ముకొని నేడు నీతులా?
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో డీఎస్సీ, గ్రూప్-1, 2, 4 పరీక్షలు కూడా పెట్టలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయా పరీక్షలను నిర్వహించామని గుర్తు చేశారు. మీరు నోటిఫికేషన్లు మాత్రమే వేశారు.. కానీ మేము పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అటువంటి బీఆర్‌ఎస్ నేతలు ఇవాళ గ్రూప్-1 అంశంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీజీపీఎస్సీ పరీక్ష పేపర్లు అమ్ముకొని నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ఫైర్ అయ్యారు. జిరాక్స్ సెంటర్ల వద్ద, పల్లి బటానీలకు పరీక్ష పేపర్లను అమ్ముకోలేదా? అని ప్రశ్నించారు. పదేళ్ల పాటు దరిద్రపు పాలన చేపట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రూప్ -1, 2 పరీక్షలను నిర్వహించామన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. గ్రూప్-1 అంశంలో సమస్య పరిష్కారం గుర్తించి మాట్లాడాల్సింది పోయి.. బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు మంచి జరిగే విధంగా టీజీపీఎస్సీ, ప్రభుత్వం కలిసి గ్రూప్-1 విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
హైకోర్టు తీర్పు సీఎంకు గుణపాఠం..
ఇదిలా ఉంటే, గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠమని విమర్శించారు. హైకోర్టు తీర్పు నిజంగా హర్షించదగినది.. నిరుద్యోగ యువతకు న్యాయం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ, టీజీపీఎస్సీ మొండిగా వ్యవహరించిందన్నారు. నిరుద్యోగుల ఆరోపణలను, వారు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా మూర్ఖంగా ముందుకు పోయినందున హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని గుర్తు చేశారు. నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిన రేవంత్ సర్కారు ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఏం సమాధానం చెబుతుందన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని హెచ్చరించారు.


