Rahul Gandhi| కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. రేపటి నుంచి తెలంగాణలో కులగణన కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేధావులు, వివిధ సామాజికవర్గాల వారితో నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నారు. బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో సాయంత్రం ఐదు గంటలకు కులగణనపై నిర్వహించే సమావేశంలో పాల్గొని వారి నుంచి సలహాలు తీసుకుంటారు. అనంతరం రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమై.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలుకుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘బలహీనుడి గళం… సామాజిక న్యాయ రణం… శ్రీ రాహుల్ గాంధీకి స్వాగతం’ అంటూ రాసుకొచ్చారు. మరోవైపు రాహుల్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నగరమంతా పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. అలాగే ఆయనకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు కట్టారు.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పర్యటనలో సీక్రెట్ సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అశోక్‌నగర్‌కు వెళ్లి నిరుద్యోగులను కలవనున్నట్లు సమాచారం. బోయిన్ పల్లి నుంచి నేరుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చికి రాహుల్ గాంధీ వెళ్లనున్నారట. అక్కడ విద్యార్థులు, నిరుద్యోగులతో భేటీ అయి వారి సమస్యలను విననున్నారట. అయితే ఈ కార్యక్రమాన్ని సీక్రెట్‌గా ప్లాన్ చేసినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.