Tuesday, November 26, 2024
Homeఆంధ్రప్రదేశ్MP RRR: చిక్కుల్లో రఘురామ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ నోటీసులు

MP RRR: చిక్కుల్లో రఘురామ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ నోటీసులు

MP RRR: వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రఘురామ రాజుకు చిక్కులు తప్పవని చెప్పక తప్పదు. గతంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా భౌతికంగా హింసించారంటూ వచ్చిన ఆరోపణలు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరు కావాలంటూ రఘురామకు తెలంగాణ సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిట్ ఆ నోటీసులలో పేర్కొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాను అని రఘురామ అన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామను విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో మరోసారి రఘురామకృష్ణరాజుకు ఇబ్బందులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

గత ఏడాది మే 14న ఏపీ సీఐడీ అధికారులు రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా రఘురామ వ్యవహరించారనే అభియోగంతో ఆయనను అరెస్ట్ చేశారు. రఘురామపై 124 ఏ, 153 బీ, 505 ఐపీసీ, 120 బీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ రాజద్రోహం సహా పలు కేసులు పెట్టారు. అయితే.. తనను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు తీవ్రంగా కొట్టారని రఘురామ ఆరోపించడం తీవ్ర సంచలనంగా మారింది. పోలీసుల దెబ్బలతో తన కాళ్లు వాచిపోయాయని చెప్పడంతో గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయన శరీరంపై గాయాలు లేవని హైకోర్టుకు చెప్పారు.

ఆ వెంటనే రఘురామ సుప్రీంకోర్టులో వైద్య పరీక్షలపై పిటిషన్ వేశారు. రఘురామను వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని, రఘురామ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున వైద్యపరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని అప్పుడు తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు అదేశించింది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక ప్రకారం.. రఘురామ ఎడమకాలి వేలు ఫ్రాక్చర్ అయిందనీ, ఇతర గాయాలు కూడా ఉన్నట్లు తేలింది. రఘురామ బెయిల్ పిటిషన్ పై తీవ్ర వాదోపవాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచీ రఘురామ ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తూనే ఉండడం విశేషం.

రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం, భౌతికంగా కొట్టడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించడం విశేషం. రఘురామ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును హెచ్చార్సీ తప్పుపట్టింది. అప్పటి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, హోం మంత్రిత్వశాఖ చీఫ్ సెక్రటరీకి నోటీసులు కూడా ఇచ్చింది.

ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించిందని సమాచారం. ఈ క్రమంలోనే రఘురామను విచారణకు రావాలని తెలంగాణ సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకూ రఘురామ రాజు రచ్చబండ ఇబ్బందికరంగా మారిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులతో రఘురామ రాజు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేను ఇరుకున పెట్టేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంల ఉమ్మడి వ్యూహమా అని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News