Mufti police at Konda Surekha house: అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను విధుల నుంచి తప్పించి 24 గంటలు గడవక ముందే.. నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని గాయత్రిహిల్స్ వద్దగల సురేఖ నివాసానికి.. మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్లారు. దీంతో అక్కడే ఉన్న కొండా సురేఖ కుమార్తె సుస్మిత వారికి అడ్డుకున్నారు. మీరు ఎవరూ.. ఎందుకు వాచ్చారని ప్రశ్నించడంతో .. మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చామని చెప్పారు. దీంతో వారిని సుస్మిత పటేల్ అడ్టుకున్నారు. ఇంతలో.. ఇంట్లో ఉన్న మంత్రి సురేఖ, సుమంత్ బయటకు వచ్చి ఒకే కారులో బయటకు వెళ్లిపోయారు.
బీసీ బిడ్డపై కుట్ర: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ విషయంలో ఓ వ్యక్తిని రివాల్వర్‌తో సుమంత్ బెదిరించినట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారంటూ మఫ్టీలో ఉన్న పోలీసులు చెప్పారని సుస్మిత పటేల్ తెలిపారు. ఇదే విషయంలో తాము మంత్రి ఉత్తమ్‌కు ఫోన్ చేస్తే.. తాను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై పెద్ద పెద్ద స్పీచులు దంచుతున్న రెడ్లు.. బీసీ బిడ్డ అయిన మా అమ్మపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇన్వాల్‌మెంట్ ఉందని సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇంట్లో మఫ్టీలో ఉన్న పోలీసులు ఉండగానే.. కొండా సురేఖ తన కారులో సుమంత్‌ను వెంట పెట్టుకుని బయటకు వెళ్లింది. వారు నేరుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి చొరవ కూడా ఉంది: డెక్కన్ సిమెంట్స్ వారితో జరిగిన మీటింగ్‌లో సుమంత్‌తోపాటు రోహిన్‌రెడ్డి సైతం ఉన్నారని కొండా సురేఖ కుమార్తె సుస్మిత అన్నారు. అది సాధారణ సమావేశమే కానీ.. బెదిరింపు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. అలా అయితే అందులో రోహిన్‌రెడ్డి సైతం బాధ్యుడే కదా అని అన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరితో పాటుగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ కూడా ఉందని ఆరోపించారు. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని కొండా మురళి చెబితేనే నేను బెదిరించానని ఆయనతో పోలీసులు తెల్లకాగితంపై రాయించే అవకాశం ఉందని సుస్మిత అన్నారు. ఆ తర్వాత మా నాన్నను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే మా నాన్నకు గన్‌మెన్‌లను కూడా తొలగించారని అన్నారు. మాజీ మావోయిస్టు అయిన కొండా మురళికి రక్షణ కొనసాగించకుండా గన్‌మెన్లను ఎందుకు తొలగించారని.. సుస్మిత పటేల్ ఆవేదనతో కూడిన ఆగ్రహంతో ప్రశ్నించారు.


