మాఘశుద్ధ పౌర్ణమి రోజు అయిన బుధవారం సారలమ్మ గద్దెపైకి రావడంతో మహా జాతర ప్రారంభమైంది. ముల్కనూర్ గ్రామంలోని గొల్లవాడలో ఉన్న సారలమ్మ గుడిలో ఆదివాసి సంప్రదాయాల ప్రకారం కోయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జంతు బలిలు ఇచ్చారు. అమ్మవారి ప్రతిరూపమైన పసుపు కుంకుమలను భరిణె రూపంలో తీసుకొని కాలినడకన డప్పు చప్పుల్లతో ..శివసత్తుల పూనకాల మధ్య అంగరంగ వైభవంగా సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో సమ్మక్క సారలమ్మ మహా జాతరకు అంకురార్పణ జరిగింది. సారలమ్మ నీ తీసుకు వస్తున్న క్రమంలో దారి పొడవునా భక్తులు నీరాజనం పలికారు. ఆరోగ్యం బాగాలేని భక్తులు మొక్కుకున్నారు. పిల్లల కోసం తపించే మహిళలు వరం పట్టారు. సమ్మక్క సారక్క అబ్బియా… జాలారు బండల్లో అబ్బియా.. జంపన్న వాగుల్లో అబ్బియా.. అంటూ సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంగణం మారుమోగాయి.
కోరిన వరాలు ఇచ్చే వనదేవతలను పదిహేను రోజుల నుంచి మది నిండా తలచుకుంటూ పూజిస్తున్న భక్తులు అమ్మ వారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మహాఘట్టంలో కోయ పూజారులు, శివసత్తులు, జాతర చైర్మన్ మాడ్గుల వీరస్వామి, కమిటీ మెంబర్లు గణబోయిన కొమురయ్య, గుడికందుల సమ్మయ్య, మాడుగుల గోపి, శ్రీరామోజు సమ్మయ్య, కొదురుపాక శ్రీనివాస్, కొత్తపల్లి సమ్మయ్య, జక్కుల ప్రకాశం, మాచర్ల సదానందం , ఆదరి రవీందర్, కొలుగూరి రాజు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.