రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రజలందరూ వినియోగించుకోవాలని, యువత చైతన్యమై ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేను కచ్చితంగా ఓటు వేస్తా అనే నినాదంతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్ పి గౌస్ ఆలం, ఓఎస్ డి అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ )డి. వేణు గోపాల్ లతో కలసి 5 కె రన్ జిల్లా కేంద్రం లోని బస్ స్టాండ్ సెంటర్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల కోసం ఓటర్ కార్డుల సవరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఓటర్ కార్డులో ఏమైనా పొరపాట్లు ఉంటే కేంద్రాలకు వెళ్లి తప్పులను సరిచేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సోమవారం నుండి ఓటర్ నమోదు కేంద్రాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తామని, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP) ప్రోగ్రామ్ కార్యకలాపాలు కళాశాలల్లో యువతీ యువకులు తెలుసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కుతోనే ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది అన్నారు.
కార్యక్రమంలో ఆర్ డి ఓ కే. సత్య పాల్ రెడ్డి, డి ఆర్ డి ఓ నాగ పద్మజా, డి పి ఓ వెంకయ్య, మత్స్యశాఖ అధికారి శ్రీపతి, డి ఈ ఓ పాణీని, డి పి ఆర్ ఓ రఫిక్, కలెక్టరేట్ ఏ ఓ ప్రసాద్, ములుగు తహసిల్దార్ ఎన్. విజయ భాస్కర్, సూపర్ ఇండెంట్ రాజ్ ప్రకాష్, ఎన్నికల సిబ్బంది, ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, యువతీ, యువకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.