Minority Panchayat in T Congress: కాంగ్రెస్‌లో మైనార్టీ మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. తమకంటే తమకు పదవి కావాలంటూ నేతలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. అయితే, ముస్లిం నేతలెవ్వరూ ఎమ్మెల్యేలుగా లేని కారణంగా రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు మైనార్టీకి మంత్రి పదవి కేటాయించలేదు. ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ఉన్నా అతనిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కాగా, సీనియర్ నేతలకే అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావించడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 6(తెలుగుప్రభ): రాబోయే మంత్రివర్గ విస్తరణలో మైనార్టీలకు తప్పకుండా అవకాశం కల్పిస్తామని ఏఐసీసీ నుంచి హామీ ఇచ్చింది. కానీ, ఇటీవల గవర్నర్ కోట ఎమ్మెల్సీలను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఎమ్మెల్సీగా ఉన్నా అమీర్ అలీ ఖాన్ పదవి పోయింది. ఈ పదవి కోసం మైనారిటీ నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ ప్లాన్ చేసింది. ఇందుకు అజారుద్దీన్‌తో పాటు మాజీ మంత్రి, సీనియర్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తీవ్రంగా ప్రయత్నించారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం షబ్బీర్ అలీ విషయంలో సానుకూలంగా వ్యవహరించారు. కానీ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ అజారుద్దీన్ వైపు మొగ్గు చూపారు. ఆయన మాజీ క్రికెటర్ కావడంతో ఎమ్మెల్సీ ఇస్తే దేశ వ్యాప్తంగా పార్టీకి మైలేజ్ వస్తుందని భావించారు. దీంతో అజారుద్దీన్ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదించింది. ఎమ్మెల్సీ కోటలో తనకు మంత్రి పదవి వస్తుందని అజారుద్దీన్ సైతం భావించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ కూడా ఆశించారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడంతో మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని అడిగారు. కానీ, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పార్టీకి లైన్ క్లియర్ అయ్యింది.
రేసులో నేనున్నా: ఫిరోజ్ ఖాన్
మరో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తనకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో తనకు అవకాశం ఇవ్వాలని పార్టీని అడుగుతున్నారు. మరో వైపు షబ్బీర్ అలీ తాను పార్టీ సీనియర్ అని, తనకు ఈసారి చాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ద్వారా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. షబ్బీర్ అలీ ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాల్సిందే.
కవిత ఎమ్మెల్సీ స్థానం ఖాళీ
ప్రస్తుత పరిస్థితిలో పార్టీ ముందున్న ఒకే ఒక అంశం ఎమ్మెల్సీ కవిత రాజీనామా. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు ఖాళీ అయ్యింది. షబ్బీర్ అలీ నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. కానీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగాలంటే, అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉండటంతో ఆ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. దీంతో షబ్బీర్ అలీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. అజారుద్దీన్ మాత్రం హైదరాబాద్ నుంచి ప్రస్తుత కేబినేట్‌లో ఎవరూ లేనందున తనకు అవకాశం ఇవ్వాలని.. ఇటు మైనార్టీ, హైదరాబాద్.. ఇలా రెండు కోటాలు తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు.
మూడు ముక్కలాట
మంత్రివర్గ బెర్త్ కోసం అజారుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ పోటీలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి సంకట స్థితి ఎదురవుతోంది. ఈ మూడు ముక్కలాటలో ఎవరికి మంత్రి వర్గ బెర్త్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అధిష్టానం ఆశీస్సులు అజారుద్దీన్‌కు ఉండటంతో ఆయన ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. మరోవైపు షబ్బీర్ అలీ పార్టీలో సీనియర్ కావడంతో ఆయనను పక్కన పెడితే పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఎవ్వరు దక్కించుకుంటారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు నాంపల్లి ఫిరోజ్ ఖాన్ సైతం కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో శ్రమించానని, ఇప్పటి వరకు తనకు ఏ పదవి లేకపోయినా నాంపల్లి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్టీని విస్తరించేందుకు కష్టపడ్డానని వాదిస్తున్నారు. కరోనా సమయంలో చేసిన సర్వీస్‌ను పార్టీ గుర్తించాలని కోరుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఏఐఎంఐఎం పార్టీ చర్యలను ఎన్నోసార్లు ఎదుర్కొని, బలమైన పోటీ ఇచ్చామని వెల్లడిస్తున్నారు. హైదరాబాద్, మైనార్టీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఎవరికి కేబినెట్ బెర్త్ అవకాశం దక్కుతుందో వేచి చూడాల్సిందే.


