Foreign body aspiration treatment: వంటింటి వైద్యం వికటించింది.. దగ్గుకు ఉపశమనం కోసం బుగ్గన పెట్టుకున్న కరక్కాయే ఓ మహిళ పాలిట యమపాశమైంది. నిద్రలో పొరపాటున మింగేయడంతో అది ఊపిరితిత్తుల్లోకి జారిపోయి, ఆమె ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టింది.
దగ్గుతో మొదలై వెంటిలేటర్‌పైకి: హైదరాబాద్‌కు చెందిన 57 ఏళ్ల విజేత అనే మహిళ కొంతకాలంగా దగ్గుతో బాధపడుతున్నారు. రాత్రిపూట దగ్గు ఎక్కువవడంతో నిద్రకు భంగం కలుగుతుందని.. వంటింటి చిట్కాగా ఓ కరక్కాయను బుగ్గన పెట్టుకుని నిద్రకు ఉపక్రమించారు. అయితే గాఢ నిద్రలో ఉన్నప్పుడు పొరపాటున దానిని మింగేశారు. అది అన్నవాహికలోకి కాకుండా శ్వాసనాళంలోకి జారిపోయింది. దీంతో ఒక్కసారిగా తీవ్రమైన దగ్గు, ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు.
Also Read: https://teluguprabha.net/lifestyle/healthy-food-makes-our-skin-look-glowing/
ఊపిరితిత్తినే మూసేసిన కరక్కాయ: అక్కడ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డా. రవీందర్ రెడ్డి ఆమెను పరీక్షించి, పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి ఐసీయూలో చేర్చారు. ఛాతీ ఎక్స్-రే, హెచ్‌ఆర్‌సీటీ స్కాన్ తీయగా, వైద్యులు దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని గుర్తించారు.
నిర్ధారణ: కరక్కాయ నేరుగా ఎడమ వైపు శ్వాసనాళంలోకి వెళ్లి, గాలి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంది. దీని కారణంగా ఎడమ ఊపిరితిత్తి మొత్తం మూసుకుపోయింది.
ప్రాణాలకు పణంగా పెట్టి: విజేతకు అప్పటికే అధిక రక్తపోటు, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. గతంలో యాంజియోప్లాస్టీ కూడా జరిగింది. ఇలాంటి క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తికి చికిత్స చేయడం వైద్యులకు పెను సవాలుగా మారింది. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డా. భరత్ జానపాటి, అనస్తీషియా బృందం సహకారంతో ‘ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ’ ప్రక్రియను చేపట్టారు.
చికిత్సా విధానం: నోటి ద్వారా ఓ సన్నని ట్యూబ్‌ను శ్వాసనాళాల్లోకి పంపి, కెమెరా సహాయంతో లోపలి పరిస్థితిని గమనించారు.
విజయవంతమైన ఆపరేషన్: ‘రాట్ టూత్ ఫోర్సెప్స్’ అనే ప్రత్యేక పరికరం సాయంతో, రెండు ముక్కలుగా విరిగి శ్వాసనాళంలో బలంగా ఇరుక్కుపోయిన కరక్కాయను రోగికి ఎలాంటి హానీ కలగకుండా అత్యంత చాకచక్యంగా బయటకు తీశారు. బ్రాంకోస్కోపీ తర్వాత తీసిన ఎక్స్-రేలో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా తెరుచుకుని, మళ్లీ పనిచేయడం ప్రారంభించింది. రోగి ఆరోగ్యం మెరుగుపడటంతో, మరుసటి రోజే ఆమెను డిశ్చార్జ్ చేశారు.


