High-interest rate investment scam : బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే పది రెట్లు అధికమంటూ ఆశ చూపాడు… అమాయక గిరిజనులే లక్ష్యంగా వల వేశాడు… ఏకంగా రూ.50 కోట్లు దండుకుని జల్సాలకు తెరలేపాడు. నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన ఈ భారీ మోసం స్థానికంగా సంచలనం రేపుతోంది. అసలు ఐస్‌క్రీమ్ పార్లర్‌తో మొదలైన అతని ప్రస్థానం, రూ.50 కోట్ల కుంభకోణం వరకు ఎలా సాగింది..? ఈ మోసాల మాస్టర్‌మైండ్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారు..?
అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఓ ఘరానా నిందితుడిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పీఏ పల్లి మండలం, వద్దిపట్ల గ్రామానికి చెందిన రమావత్ బాలాజీ నాయక్‌ను అదుపులోకి తీసుకుని, అతని నుంచి కీలకమైన ఆస్తి పత్రాలు, రెండు విలువైన కార్లు, బాధితులకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఐస్‌క్రీమ్ పార్లర్ నుంచి.. రూ.50 కోట్ల స్కామ్ వరకు : పోలీసుల కథనం ప్రకారం, రమావత్ బాలాజీ 2020లో ఐస్‌క్రీమ్ పార్లర్ వ్యాపారం పెడతానంటూ బంధువుల వద్ద రూ.5 లక్షలను రూ.2 వడ్డీకి తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేశాడు. అదే గ్రామానికి చెందిన వారి దగ్గర రూ.6 వడ్డీ చొప్పున రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు తీసుకున్న అప్పులకు సకాలంలో వడ్డీ చెల్లిస్తూ అందరిలోనూ అపారమైన నమ్మకాన్ని కలిగించాడు.
ఈ నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకుని, ఏజెంట్లను నియమించుకుని చుట్టుపక్కల గిరిజన తండాలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి వారి నుంచి భారీగా డిపాజిట్లు సేకరించడం ప్రారంభించాడు. ఇలా పోగైన కోట్లాది రూపాయల నగదుతో బంధువులు, స్నేహితుల పేర్ల మీద ఖరీదైన కార్లు, వ్యవసాయ భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు.
రూ.10 వడ్డీ వల.. చిక్కిన జనం : ఇంకా ఎక్కువ డబ్బులు దండుకునే దురుద్దేశంతో, బాలాజీ తన ఎత్తుగడను మార్చాడు. ఏకంగా నెలకు రూ.10 వడ్డీ (అంటే లక్షకు నెలకు పది వేల రూపాయలు) ఇస్తానని జనాలను నమ్మబలికాడు. బ్యాంకు వడ్డీ కంటే ఇది పది రెట్లు అధికం కావడంతో, చాలామంది ఆశపడి తమ కష్టార్జితాన్ని అతనికి అప్పగించారు. కోట్లలో డబ్బు వసూలు చేసిన బాలాజీ, మొదట్లో కేవలం వడ్డీ మాత్రమే చెల్లిస్తూ, బాధితుల వద్ద ఉన్న ప్రామిసరీ నోటు వెనుక వడ్డీ ఇచ్చినట్లు రాసి ఇచ్చేవాడు.
“రమావత్ బాలాజీ ఏజెంట్లను నియమించుకొని సమీపంలోని గిరిజన తండాల్లో ఎక్కువ వడ్డీకి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నాడు. ఈ నగదుతో బంధువులు, మిత్రుల పేరిట ఖరీదైన కార్లు, వ్యవసాయ భూములు, ఇళ్లు, బైక్‌లు కొనుగోలు చేశాడు. అనంతరం జల్సాలు చేసేవాడు. ఇంకా ఎక్కువ డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతో నెలకు రూ.10 వడ్డీ ఇస్తానని జనాలను నమ్మించాడు. రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసి వడ్డీ మాత్రమే ఇచ్చి బాధితుల వద్ద ఉన్న ప్రామిసరీ నోటు వెనుక వడ్డీ ఇచ్చినట్లు రాసి ఇచ్చేవాడు. బ్యాంక్‌లో వారు పొందే వడ్డీ కంటే 10 రేట్లు అధిక వడ్డీ ఆశ చూపడంతో జనాలు ఆకర్షితులై బాలాజీ నాయక్‌కి ఎక్కువ మొత్తంలో అప్పు ఇచ్చారు. గత కొన్ని నెలలుగా బాధితులకు అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వలేకపోయే పోయాడు. వారంతా అతడిపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు.”
– శరత్ చంద్ర పవార్, నల్గొండ జిల్లా ఎస్పీ
కొన్ని నెలలుగా అసలు, వడ్డీ రెండూ చెల్లించకపోవడంతో బాధితులు అతనిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో వారి నుంచి తప్పించుకుని బాలాజీ పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


