Thursday, September 19, 2024
HomeతెలంగాణNallagonda: సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో సాగుదాం

Nallagonda: సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో సాగుదాం

పరేడ్ గ్రౌండ్ లో పతాకావిష్కరణ చేసిన మంత్రి వెంకటరెడ్డి

తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని రోడ్లు పవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కలెక్టర్ సి నారాయణరెడ్డి ఐఏఎస్, ఎస్పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం,బాలు నాయక్ లతో కలిసి పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్నీ ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవము జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావం కోసం అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు.. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్లో విలీనమై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.

ఈ దేశం మన అందరిది అనే భావన ప్రతీ ఒక్కరిలో ఉండాలని” కలలు కన్న మహాత్మాగాంధీ ఆశయం, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రుల నాయకత్వం, ప్రజల సుదీర్ఘ పోరాటంతో స్వతంత్ర భారతదేశం ఏర్పాటయింది.అయితే, దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య సంబరాల్లో మునిగిపోతే బ్రిటన్ పార్లమెంటు ఆమోదించిన ఇండియా ఇండిపెండెన్స్ యాక్టు కారణంగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్యానికై ఇంకా పోరాడాల్సి వచ్చిందన్నారు.నిజాం నిరంకుశ పాలనలో భూస్వామ్య, జాగీర్దారీ విధానం, వెట్టిచాకిరి, బలవంతపు పన్నుల వసూళ్లు, రజాకార్ల దాష్టికం, ఆగడాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారనీ దీంతో నిప్పు రవ్వ అడవిని అంటుకున్నట్టు చిన్న చిన్నగా మొదలైన నిజాం వ్యతిరేక పోరాటం తెలంగాణ మొత్తం వ్యాపించింది. రైతులు, మహిళలు, సకల జనులంతా ఏకమై ఆయుధాలు ధరించి, హైదరాబాదు సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని సాయుధ పోరాటం ఉధృతం చేశారన్నారు.జోగిపేటలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రజనకేంద్ర సభ ఆంధ్రమహా సభగా ప్రకటించుకోవడంతో ఉద్యమం తీవ్రమయ్యింది.ఆంధ్ర మహాసభల ద్వారా శ్రీ మగ్దూం మోహియోద్దీన్,రాజ్ బహదూర్ గౌర్, రామానందతీర్థ, మాడపాటి హనుమంత రావు,బూర్గుల రామకృష్ణా రావు,కొండా వెంకట రంగారెడ్డి,రావి నారాయణ రెడ్డి వంటి మరెందరో మహానుభావులు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. నల్లగొండ జిల్లా నుండి భీంరెడ్డి నర్సింహా రెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జిట్టా రామచంద్రారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, సుశీల దేవి, సుద్దాల హనుమంతు,బొందుగుల నారాయణ రెడ్డి వంటి ఎందరో త్యాగధనులు తెలంగాణలో స్వాతంత్రోద్యమాన్ని ప్రభావితం చేశారు.ఉద్యమ తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తీవ్రతరమైంది.ఈ పోరాటంలో చాకలి ఐలమ్మ,మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలా దేవిలు కీలక పాత్ర పోషించారు.బండి యాదగిరి రాసిన “బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతావు కొడుకో.. నైజాం సర్కారోడో…” పాట తెలంగాణా సాయుధ పోరాటాన్ని మరో మెట్టు ఎక్కించిందన్నారు.భూస్వామ్య జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి, కడవెండి, రావులపెంట, ఏనెమీదిగూడెం ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయి. గుండ్రాంపల్లిలో 26 మంది సాయుధ పోరాటవీరులను రజాకార్ల గూండాలు చంపి బావిలో పాతిపెట్టిన దురదృష్టకర సంఘటనను చరిత్ర తన గర్భంలో దాచుకున్నది.తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభం అయ్యింది. 2011 నుండి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జె.ఏ.సి.) నాయకత్వంలో తెలంగాణ విద్యార్ధులు, ఉద్యోగ సంఘాలు, తీవ్ర ఉద్యమం చేశారు.. తెలంగాణ ఉద్యమంలో మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంతాచారితో పాటు ఎందరో నవయువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు, నా ప్రజలు ఇంత ఉద్యమించినప్పుడు నాకీ మంత్రిపదవి ఎందుకని ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి కేబినేట్ పదవికి రాజీనామా చేశాను.అంతేకాదు.. ప్రజా క్షేత్రంలో దిగి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు దిగాను. పోలీసు యంత్రాంగం.. ఇంటలిజెన్స్ శాఖ దీక్ష వల్ల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాణాలకు ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నరు, ఆయన ఆరోగ్యం ఇప్పటికే క్షీణించింది. ఏదైనా జరగరానిది జరిగితే ప్రజలు తీవ్రంగా స్పందిస్తే ఆపటం ప్రభుత్వం వల్లకాదని అప్పటి ముఖ్యమంత్రికి నచ్చజెప్పితే నన్ను రాత్రికి రాత్రి దవాఖానాకు తరలించిండ్రు సోనియాగాంధీ తెలంగాణ బిడ్డల త్యాగాలను, పోరాటాలను చూసి చలించిపోయి రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమం చేస్తూ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ 6 ప్రతిపాదనల ఆధారంగా 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2014 జూన్, 2 వ తేదీన “తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం” ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల పట్ల మిక్కిలి గౌరవాన్ని ప్రకటిస్తున్నది.ఇటీవల కోఠి మహిళా విశ్వ విద్యాలయానికి “చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం” గా నామకరణం చేయడం జరిగింది. అలాగే హ్యాండ్ లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్షణ్ బాపూజీ పేరు పెట్టడం జరిగింది.ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో కొత్త ఉద్యోగకల్పన కోసం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడం జరిగింది.రాష్ట్ర మహిళలలందరికీ మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం.ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది.మహాలక్ష్మి పథకం కింద నిరుపేదలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాము.ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభించుకున్నాం.నిరుపేదలకు గృహజ్యోతి పథకం క్రింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.


చరిత్ర కనీవిని ఎరుగని రీతిలో ఏక కాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం, ఇందులో మన నల్గొండ జిల్లాలో 1 లక్ష 73 వేల కుటుంబాలకు 1433 కోట్లు రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రుణమాఫీలో నా నల్గొండ జిల్లాకు అత్యధిక లబ్ధిజరగడం నాకు మిక్కిలి సంతోషం కలిగిస్తున్నదన్నారు.రాబోయే రోజుల్లో మరింత కష్టపడి నల్గొండ జిల్లా రైతులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.నల్లగొండ ప్రజల కష్టసుఖాలు నాకు తెలుసు వారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉండే విధంగా వారానికి ఒక రోజు నేనే స్వయంగా ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నాను.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవడమే కాక వారి సమస్యలను అప్పటికప్పుడే వేగంగా పరిష్కరిస్తున్నాం.
అంతేకాదు, బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం త్వరితగతిన పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తానని మాటిస్తున్నాను.ఇకపోతే, 275 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల, 20 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాలను నిర్మించుకుంటున్నాం. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను నిర్మించుకుంటున్నాం.ఇక మన నల్గొండ జిల్లాలో 2024-25 సంవత్సరంలో 241.90 కి. మీ. ల రోడ్లు, బ్రిడ్జీలు మరియు 3 భవనాల మరమ్మత్తులకు 512 కోట్ల 81 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికి అందేలా నల్లగొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్, ఎస్పి, జిల్లా అధికార యంత్రాంగం, పాత్రికేయ మిత్రులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నానని అన్నారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర, ఆర్డీవో రవి, ఏఎస్పి రాములు నాయక్, మున్సిపాలిటీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డి సి ఎస్ ఓ వెంకటేశ్వర్లు, డీఈవో బిక్షపతి పలురాధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News