series of murders in Nallamala forest : దట్టమైన పచ్చదనం, జాలువారే జలపాతాలు, పెద్దపులుల సంచారం, అమూల్యమైన ఔషధ మొక్కల నిలయం… ఇదీ నల్లమల అడవి అంటే మన కళ్లముందు కదలాడే దృశ్యం. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమైన ఈ అభయారణ్యం, ఇప్పుడు అరాచకాలకు అడ్డాగా, హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. పర్యాటకం అనే ముసుగు వేసుకుని అడవిలోకి ప్రవేశిస్తున్న కొందరు దుర్మార్గులు,ఈ ప్రశాంత వాతావరణాన్ని రక్తంతో తడుపుతున్నారు. పథకం ప్రకారం హత్యలు చేయడం, ఆధారాలు దొరక్కుండా కాల్చివేయడం, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం వంటి పైశాచిక చర్యలతో నల్లమల కీర్తిని మసకబారుస్తున్నారు. ఇంతటి ప్రకృతి రమణీయ ప్రదేశం, నరహంతకులకు సురక్షిత స్థావరంగా ఎలా మారింది? నిఘా వ్యవస్థల కళ్లుగప్పి ఈ ఘోరాలు ఎలా జరుగుతున్నాయి?
పర్యాటకం ముసుగులో ఘోర కలి : నల్లమల అందాలను ఆస్వాదించడానికి వస్తున్న వారి ముసుగులో కొందరు నేరస్థులు అడవిలోకి సులభంగా ప్రవేశిస్తున్నారు. రాత్రి పగలు, వివాహేతర సంబంధాలు, గుప్త నిధుల గొడవలు వంటి కారణాలతో తమ ప్రత్యర్థులను ఇక్కడికి తీసుకొచ్చి, అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు. జనసంచారం తక్కువగా ఉండే మారుమూల ప్రాంతాలను ఎంచుకుని, హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి కాల్చివేయడం లేదా మృతదేహాలను లోతైన ప్రాంతాలలో పడేయడం వంటి చర్యలతో ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇటీవల వెలుగుచూసిన ఘోరాల పరంపర : గత ఏడాది కాలంలో నల్లమల పరిసర ప్రాంతాలలో జరిగిన కొన్ని సంఘటనలు గుండెలను పిండేస్తున్నాయి.
జులై 29, 2025: గుప్త నిధుల ఆశ చూపి, అవి చూపలేదని ఓ వ్యక్తిని హత్య చేసి బల్మూరు మండలం మైలారం శివార్లలో పాతిపెట్టారు.
ఇటీవల: ప్రకాశం జిల్లాకు చెందిన ఓ తండ్రి, తన ముగ్గురు పిల్లలను ఉప్పునుంతల మండలంలోని అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి, పెట్రోల్ పోసి నిప్పంటించి కిరాతకంగా చంపేశాడు.
జులై, 2025: కల్వకుర్తికి చెందిన వ్యక్తిని హత్య చేసి, మృతదేహాన్ని కొల్లాపూర్ సమీపంలోని సింగోటం జలాశయంలో పడేశారు.
ఫిబ్రవరి, 2025: హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను పెద్దకొత్తపల్లి మండలంలో, జడ్చర్లకు చెందిన మరో మహిళను ఫర్హాబాద్ అటవీ ప్రాంతంలో హత్య చేసి దహనం చేశారు.
డిసెంబరు, 2024: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసి బల్మూరు మండలంలో పడేశారు.
నిఘా వైఫల్యం.. నేరస్థులకు అలుసు : ఈ వరుస ఘోరాలకు అధికారుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యం కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
పనిచేయని సీసీ కెమెరాలు: హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై, ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చాలా వరకు పనిచేయడం లేదు. ముఖ్యంగా అక్రమాలకు కేంద్రంగా మారిన అచ్చంపేట హాజీపూర్ కూడలిలో నిఘా కరువైంది.
లాడ్జీలపై పర్యవేక్షణ శూన్యం: అచ్చంపేట, మన్ననూర్, ఈగలపెంట వంటి పర్యాటక ప్రాంతాల్లోని లాడ్జీలలో సరైన నిబంధనలు పాటించడం లేదు. ఎవరు వస్తున్నారు, ఎక్కడనుంచి వస్తున్నారు అనే వివరాలు లేకుండానే గదులు అద్దెకు ఇస్తుండటంతో, అవి నేరస్థులకు తాత్కాలిక స్థావరాలుగా మారుతున్నాయి.
అధికారుల స్పందన: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డీఎస్పీ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ, గుర్తు తెలియని వ్యక్తుల కదలికలను గమనించటానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. హాజీపూర్ జాతీయ రహదారిపై ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూస్తాం,” అని తెలిపారు. అయితే, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని నల్లమల పవిత్రతను కాపాడాలని స్థానికులు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు.


