Namo Drone Didi scheme : పొదుపు సంఘాల నుంచి పైలట్ల వరకు.. గ్రామీణ మహిళల ప్రగతి ప్రస్థానంలో ఇదో సరికొత్త అధ్యాయం. పొలం గట్లపై కనిపించే మహిళలు, ఇప్పుడు ఆకాశంలో డ్రోన్లు నడుపుతూ అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. రైతుకు పెట్టుబడి భారం తగ్గిస్తూ, తమకు తాముగా ఉపాధి సృష్టించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకమే ఈ మార్పుకు నాంది పలుకుతోంది. అసలు ఏమిటీ పథకం..? మహిళలు డ్రోన్ పైలట్లుగా ఎలా మారుతున్నారు..?
రైతన్నకు అండగా.. మహిళకు ఆదాయంగా : వ్యవసాయంలో కూలీల కొరత, అధిక పెట్టుబడులు రైతులను వేధిస్తున్న ప్రధాన సమస్యలు. ముఖ్యంగా ఎరువులు, పురుగుమందుల పిచికారీకి సమయం, ఖర్చు రెండూ ఎక్కువే. ఈ సమస్యలకు ఆధునిక సాంకేతికతతో పరిష్కారం చూపుతూ, అదే సమయంలో మహిళలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. స్వయం సహాయక సంఘాల్లో (SHG) చురుగ్గా ఉండే ఔత్సాహిక మహిళలను ఎంపిక చేసి, వారికి డ్రోన్ల వినియోగంపై పూర్తిస్థాయిలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణ నుంచి ఉపాధి వరకు : ఈ పథకం కింద మహిళలకు కేవలం శిక్షణ ఇవ్వడమే కాదు, ఉపాధికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.
సమగ్ర శిక్షణ: ఏ పంటకు, ఎలాంటి మందులు, ఎంత మోతాదులో పిచికారీ చేయాలో శాస్త్రీయంగా శిక్షణ ఇస్తారు. డ్రోన్‌ను సురక్షితంగా ఆపరేట్ చేయడం, చిన్నపాటి మరమ్మతులు చేయడం వంటి అంశాలనూ నేర్పిస్తారు.
ఆర్థిక చేయూత: రెండో విడతలో భాగంగా, డ్రోన్ పరికరాల కొనుగోలుకు రూ.8 లక్షల రాయితీతో పాటు, మండల, గ్రామ సమైఖ్యల ద్వారా రూ.2 లక్షల వరకు రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
ఆదాయ పంపిణీ: డ్రోన్ పిచికారీ ద్వారా వచ్చిన ఆదాయంలో సగం డ్రోన్ ఆపరేటర్, సహాయకుడికి చెల్లిస్తారు. మిగిలిన సగం మండల సమాఖ్య ఖాతాకు జమ అవుతుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది కరీంనగర్‌లో 7, జగిత్యాలలో 13, పెద్దపల్లిలో 2, రాజన్న సిరిసిల్లలో 9 చొప్పున డ్రోన్లను పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
అరుదైన అవకాశం.. ఆదర్శంగా శ్రీలత : ఈ పథకంతో తమ జీవితమే మారిపోయిందంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలానికి చెందిన తన్నీరు శ్రీలత. “రెండేళ్ల క్రితం శిక్షణ తీసుకుని డ్రోన్ ఆపరేటర్‌గా మారాను. పురుగుమందులు పిచికారీ చేస్తూ మంచి ఉపాధి పొందుతున్నాను. గతేడాది ప్రధానమంత్రి మోదీతో సమావేశంలో పాల్గొనే అవకాశం రావడం నా అదృష్టం. ఒక సాధారణ మహిళగా సంఘంలో చేరి, డ్రోన్ ఆపరేటర్‌గా ఎదగడం చాలా ఆనందంగా ఉంది,” అని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.
“స్వశక్తి సంఘాల మహిళల ఆదాయం రెట్టింపు చేసేందుకు డ్రోన్ పరికరాలు పంపిణీ చేస్తున్నాం. ఈ ఆధునిక విధానంతో రైతులకు పెట్టుబడుల ఖర్చు, సమయం ఆదా అవుతున్నాయి. కూలీల కొరత సమస్య కూడా తీరుతోంది.”
– శ్రీనివాస్, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి, పెద్దపల్లి
ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడమే కాకుండా, గ్రామాల్లో సాంకేతిక నిపుణులుగా గౌరవాన్ని కూడా పొందుతున్నారు. మరికొంతమంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


