ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరుకు సిద్ధం కావాలని తట్టా చెమ్మస్ మర్రేసి బొగ్గు బావులను కాపాడుకోవాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ లు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నస్పూర్ మున్సిపాలిటీలోని సిసిసి కార్నర్ వద్ద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహానిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీజేపీ ప్రభుత్వం సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ… రామగుండం ఎరువుల కర్మాగారం పునః ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమంటూ మాట ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నారని, అందులో భాగంగానే సింగరేణి బొగ్గు బాయిలను వేలం వేస్తూన్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో బొగ్గు బాయిలను సింగరేణి సంస్థకు కాకుండా ప్రైవేటుపరం చేస్తే, బిజెపి నాయకులను సింగరేణి ప్రాంతంలో తిరగకుండా కార్మికులే అడ్డుకుంటారని అన్నారు. తెలంగాణ ఉద్యమ తరహా మరోమారు సింగరేణి ప్రైవేటీకరణ పై ఉద్యమించాలని, పార్టీలకు, కార్మిక సంఘాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి, కోవ లక్ష్మి, ఎమ్మేల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, జోగు రామన్న, బాపురావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, నరదాసు లక్ష్మణ్, నల్లాల ఓదెలు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకుడు కలవెని శంకర్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, సిపిఐ నాయకులు రేగుంట చంద్రశేఖర్, మేకల దాసు, లింగం రవి, కార్మికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.