తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ షాకిచ్చింది. రాష్ట్రంలో నిర్మిస్తున్న డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని పేర్కొంటూ.. రూ.900 కోట్ల జరిమానా విధించింది. గతంలో ఆ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చినా.. పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం నిర్మాణ వ్యయంలో 1.5 శాతం జరిమానాను విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ తీర్పును వెలువరించింది.
కాగా.. తెలంగాణ సర్కార్ పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. ఆయనతో పాటు.. ఏపీ ప్రభుత్వం, కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వర రెడ్డి అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించింది. ఏపీలో పర్యవరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు.