National Highway emergency helpline : అర్ధరాత్రి హైవేపై ప్రయాణం.. కుటుంబంతో వెళ్తున్న కారు హఠాత్తుగా ఆగిపోయింది.. చుట్టూ చిమ్మచీకటి, ఎవరిని సహాయం అడగాలో తెలియని నిస్సహాయత! ఇలాంటి భయానక పరిస్థితులు ఎదురైనప్పుడు, మనకు అండగా నిలిచేందుకు ఓ ‘ఆపద్బాంధవుడు’ ఉన్నాడని మీకు తెలుసా.? అదే జాతీయ రహదారుల సంస్థ (NHAI) అందుబాటులోకి తెచ్చిన 1033 హెల్ప్‌లైన్. అసలు ఎలా పనిచేస్తుంది ఈ వ్యవస్థ? కేవలం ఫోన్ కాల్‌తో ఎలాంటి సేవలు పొందవచ్చు?
జాతీయ రహదారులపై ప్రయాణించే వారి భద్రతే లక్ష్యంగా, NHAI ఈ వినూత్న వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రమాదాలు జరిగినప్పుడు, వాహనాలు మొరాయించినప్పుడు, లేదా మరేదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, ప్రయాణికులకు తక్షణ సహాయం అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.
SOS ఫోన్ కేంద్రాలు: ఆదిలాబాద్ జిల్లాలోని NH-363పై, శ్రీరాంపూర్ నుంచి రేపల్లెవాడ వరకు, ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున, ఇరువైపులా 25 SOS ఫోన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మీ వద్ద ఫోన్ ఉంటే, నేరుగా 1033 టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. మీరు 1033కు కాల్ చేసిన వెంటనే, ఆ సమాచారం నేరుగా NHAI కంట్రోల్ రూమ్‌కు వెళ్తుంది. మీ లొకేషన్‌ను గుర్తించిన సిబ్బంది, మీకు అవసరమైన సహాయంతో నిమిషాల్లో మీ వద్దకు చేరుకుంటారు.
అందించే సేవలు: ప్రమాదంలో ఎవరైనా గాయపడితే, ఈ హెల్ప్‌లైన్ నేరుగా అంబులెన్స్ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉండటం వల్ల, ‘గోల్డెన్ అవర్’లో వైద్యం అంది, ప్రాణాపాయం తప్పుతుంది. ఇటీవల శ్రీరాంపూర్ వద్ద కారు బోల్తా పడినప్పుడు, ఈ సేవ ద్వారానే క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించి, ప్రాణాలు కాపాడారు.
పెట్రోల్ అయిపోతే: పెట్రోలింగ్ సిబ్బంది వచ్చి, 5 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ అందిస్తారు. దానికి అయ్యే ఖర్చును మాత్రం మనం చెల్లించాల్సి ఉంటుంది. సిబ్బంది వచ్చి, టైర్ మార్చడంలో ఉచితంగా సహాయపడతారు. వాహనం పాడైపోయి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే, క్రేన్ సాయంతో వాహనాన్ని సురక్షిత ప్రదేశానికి తరలిస్తారు. అవసరమైతే, సమీపంలోని మెకానిక్ వివరాలు అందిస్తారు.
ఇతర ప్రమాదాలు: దాడులు, దోపిడీల వంటివి జరిగితే, ఈ నంబర్ నేరుగా పోలీస్ స్టేషన్లు, హైవే పెట్రోలింగ్ యూనిట్లకు అనుసంధానమై ఉండటం వల్ల, తక్షణ రక్షణ లభిస్తుంది. ఈ సేవలన్నీ 24/7 అందుబాటులో ఉంటాయి. కాబట్టి, ఇకపై జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు, మీ ఫోన్‌లో ‘1033’ నంబర్‌ను తప్పకుండా సేవ్ చేసుకోండి.

