Farmer welfare India: దేశ రక్షణ ఎంత ముఖ్యమో, అన్నదాతలైన రైతు రక్షణ కూడా అంతే ముఖ్యం అనే కీలక విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించి, వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్నవారికి ప్రతిష్టాత్మక ‘రైతు నేస్తం’ పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశ జనాభాలో దాదాపు 58 శాతం మంది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపైన ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు. అందుకే, రైతులను మర్చిపోవడం అంటే దేశ భవిష్యత్తును మర్చిపోవడమేనని ఆయన ఉద్ఘాటించారు. రైతు నేస్తం మాసపత్రిక ద్వారా రెండు దశాబ్దాలుగా రైతుల అభ్యున్నతికి సేవలు అందిస్తున్న యడ్లపల్లి వెంకటేశ్వరరావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
గిట్టుబాటు ధర, వ్యవస్థలో మార్పులు తప్పనిసరి:
“జీవితంలో ఇతరుల కోసం పనిచేసేవారే మన అన్నదాతలు. వారి శ్రమకు సరైన న్యాయం జరగాలి.” అని వెంకయ్యనాయుడు అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. కేవలం రుణమాఫీలు కాకుండా, దీర్ఘకాలిక విధాన నిర్ణయాలు, వ్యవస్థాగత మార్పులే రైతుకు నిజమైన భద్రతనిస్తాయని వెంకయ్యనాయుడు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రైతు సంక్షేమంపై ప్రముఖుల చర్చ.. ఈ పురస్కార వేదికకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.


