వింటే మహాభారతమే వినాలి, తింటే నాటు కోడే తినాలి అన్న నిర్వచనం చెబుతున్నారు మాంసహార ప్రియులు. మాంసాహార ప్రియుల్లో నాటుకోడి అనగానే నోళ్ళూరని వారు ఉండరనే చెప్పవచ్చు అంతటి టేస్ట్ నాటు కోళ్ల వంటకం ప్రత్యేకమని చెప్పక తప్పదు. చాలామంది వీఐపీలు, రాజకీయ నాయకులు, వ్యాపారులు నాటు కోళ్ల వంటకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటంతో డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నాటు కోళ్ల పెంపకం లాభసాటిగా ఉండేది. అయినప్పటికీ ప్రస్తుతం పల్లెల్లోనూ నాటు కోళ్ల పెంపకం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. దీంతో ధర విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం నాటుకోడి ధర నాలుగు వందల నుండి ఐదు వందల వరకు పలుకుతుంది.ఉదాహరణకు ఒక కిలో కోడిని కట్ చేసి క్లీన్ చేస్తే ఏడు వందల గ్రాములకు మించి రాదు దీంతో కిలో చికెన్ కావాలంటే ఏడు వందల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అదే ఫారంలో పెంచిన కోళ్ల చికెన్ కేవలం రెండు వందలకే మార్కెట్లో లభిస్తుంది.
నాటు కోళ్ల ధర ఎంత పెరిగినా, మాంసాహారులు నాటు కోళ్ల వంటకాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్నప్పటికీ, నాటు కోళ్ల కొరత విపరీతంగా ఉంది. నాటు కోళ్ల డిమాండ్ అధికంగా ఉన్న కారణంగా కొంతమంది వ్యాపారులు సరిహద్దుల్లోని మహారాష్ట్రకు వెళ్లి నాటు కోళ్లను జిల్లాకు తీసుకువచ్చి లబ్ధి పొందుతున్నారు. ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు నాటు కోళ్ల కోసం చక్కర్లు కొడుతుండడం షరా మామూలే అన్న చందంగా తయారైంది