New Dialysis Centers in Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది సర్కారు. రోగుల అవసరాల దృష్ట్యా కొత్త డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు, డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. 2009లో డయాలసిస్ సేవలు ప్రారంభించినప్పుడు 1230 మంది డయాలసిస్ పేషెంట్లు, ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 12 వేలు దాటిందని తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. క్యాన్సర్, కిడ్నీ జబ్బులు పెరగడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డయాలసిస్ పేషెంట్లు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారని, వారికి పెన్షన్ అందించి కొంత వరకూ ఆర్థికంగా బాసటగా నిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్థులు భారీగా పెరిగినందున ప్రతి 20 కిలో మీటరు దూరానికో డయాలసిస్ సెంటర్ ఉండేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ఇక నగరంలో దూరంతో సంబంధం లేకుండా ప్రయాణ సమయాన్ని బట్టి త్వరగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. డయాలసిస్ కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండకూడదన్నారు. పేషెంట్లతో పాటు ప్రయాణించి, పేషెంట్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండొద్దన్నారు. పట్టణ ప్రాంతాల్లో దూరంతో పాటు, పేషెంట్ల సంఖ్య, జనాభాను కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడెక్కడ వీటిని ఏర్పాటు చేయోలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే ఉన్న సెంటర్లలో అవసరమైనచోట మిషన్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. వీటితో కలిపి ప్రస్తుతం 102 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయని.. ఈ సెంటర్లలో నిత్యం సుమారు 7550 మంది పేషెంట్లు డయాలసిస్ చేయించుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటళ్లలో సుమారు మరో 5060 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని వివరించారు.
జీవన శైలి వ్యాధులపై దృష్టి పెట్టండి…
నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఆరోగ్యకరమైన జీవన విధానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సదరు అధికారులను ఆదేశించారు. బీపీ, షుగర్లు వస్తే పోయేవి కాదు అని, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ చికిత్స ఒక్కరోజుతోనే ఒక నెలతో పూర్తవ్వదని రోగులకు తెలిసేలా చెప్పాలన్నారు. ఆయా జబ్బుల బారిన పడిన ప్రజలకు చికిత్స అందించేందుకు అనుగుణంగా మన హాస్పిటల్స్ తయారు కావాలన్నారు. అందులో భాగంగానే ఎన్‌సీడీ క్లినిక్‌లు, కేన్సర్ డే కేర్ సెంటర్లు పెట్టుకున్నామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


