Saturday, November 15, 2025
HomeతెలంగాణSAFETY FIRST: లిఫ్ట్ ప్రమాదాలకు చెక్.. డిసెంబర్ 22 నుంచి కొత్త భద్రతా కోడ్!

SAFETY FIRST: లిఫ్ట్ ప్రమాదాలకు చెక్.. డిసెంబర్ 22 నుంచి కొత్త భద్రతా కోడ్!

New safety code for lifts : లిఫ్ట్ ఎక్కుతున్నారా? ఇకపై గుండె అరచేతిలో పెట్టుకోవాల్సిన పనిలేదు. తరచూ జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఓ విప్లవాత్మకమైన కొత్త భద్రతా కోడ్‌ను తీసుకొచ్చింది. యూరోపియన్ ప్రమాణాలకు దీటుగా రూపొందించిన ఈ కొత్త నిబంధనలతో, ఇకపై మన లిఫ్టులు మెట్రో రైళ్లలా అత్యంత సురక్షితంగా మారనున్నాయి. అసలు ఈ కొత్త కోడ్‌లో ఏముంది? ఇది మన భద్రతను ఎలా పెంచనుంది?

- Advertisement -

ఎందుకీ కొత్త కోడ్ : లిఫ్ట్ డోర్లు తెరుచుకోవడం, మధ్యలో ఆగిపోవడం, వేగంగా కిందకు పడిపోవడం వంటి ప్రమాదాలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణమయ్యాయి. ఈ ప్రమాదాలను నివారించి, ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసే లక్ష్యంతో, పాత ‘IS 14665’ స్థానంలో, BIS కొత్తగా ‘IS 17900’ కోడ్‌ను రూపొందించింది. ఇది డిసెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

కొత్త కోడ్‌లోని కీలక అంశాలు.. మన భద్రతకు భరోసా : ఈ కొత్త కోడ్, లిఫ్టుల డిజైన్, నిర్మాణం, నిర్వహణలో కఠినమైన నిబంధనలను తప్పనిసరి చేస్తోంది.
మెట్రో తరహా డోర్ లాక్: ఇకపై, లిఫ్ట్ డోర్లు పూర్తిగా మూసుకుంటేనే అది కదులుతుంది. మెట్రో రైలులాగే, ప్రయాణంలో ఉన్నప్పుడు డోర్లు తెరుచుకోకుండా ఆటోమేటిక్ లాకింగ్ వ్యవస్థ ఉంటుంది. దీనివల్ల, డోర్ల మధ్య ఇరుక్కుని జరిగే ప్రమాదాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది.
స్పీడ్ గవర్నర్లు: లిఫ్ట్ అతివేగంగా పైకి లేదా కిందకు వెళ్లకుండా ‘స్పీడ్ గవర్నర్లు’ నియంత్రిస్తాయి.
వీల్‌ఛైర్ ఫ్రెండ్లీ: ఇకపై నిర్మించే అన్ని లిఫ్టులలో వీల్‌ఛైర్ పట్టేంత (కనీసం 800mm వెడల్పు) స్థలం ఉండటం తప్పనిసరి.
అత్యవసర ఏర్పాట్లు: కరెంట్ పోయినా, కనీసం గంటపాటు పనిచేసే ఎమర్జెన్సీ లైటింగ్ వ్యవస్థ ఉండాలి. సహాయం కోసం, రెండు రకాల కమ్యూనికేషన్ మార్గాలు (ఇంటర్‌కామ్ వంటివి) తప్పనిసరి. ఇవి 24 గంటలూ సర్వీస్ ప్రొవైడర్ లేదా బిల్డింగ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమై ఉండాలి.దృష్టి లోపం ఉన్నవారి కోసం, ఫ్లోర్ల వివరాలను ఆడియో రూపంలో తెలిపే వ్యవస్థ ఉండాలి.

రాష్ట్రాల చట్టాలపై ప్రభావం : ప్రస్తుతం తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో లిఫ్టులకు ప్రత్యేక చట్టాలు లేవు. ఈ కొత్త BIS కోడ్ దేశవ్యాప్తంగా తప్పనిసరి కావడంతో, అన్ని రాష్ట్రాల్లోనూ లిఫ్టుల తయారీ, నిర్వహణలో ఏకరీతి ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి.

కొత్తగా ఏర్పాటు చేసే లిఫ్టులు, BIS గుర్తింపు పొందిన ఏజెన్సీలచే ‘IS 17900’ ప్రకారం ధ్రువీకరణ పొందడం తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించని తయారీదారులపై చర్యలు తీసుకోవాలంటే, తెలంగాణలో కూడా ప్రత్యేక ‘లిఫ్ట్ యాక్ట్’ తీసుకురావాలి.”
– చల్లా అవినాశ్, అధ్యక్షుడు, తెలంగాణ ఎలివేటర్స్ అసోసియేషన్

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad