Telangana BJP: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రకటనలో ఆలస్యం వెనక పలు జాతీయ మరియు రాష్ట్రస్థాయి పరిణామాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. మొదటగా ఈ ప్రకటన ఏప్రిల్ నెలలో వెలువడాల్సి ఉండగా, ఆ సమయంలో జరిగిన పహాల్గామ్ ఉగ్రదాడి మరియు ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” వల్ల కేంద్రం దృష్టి ఆ దిశగా మళ్లింది. దీనివల్ల కేవలం తెలంగాణే కాదు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా వంటి ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ రాష్ట్రాధ్యక్షుల నియామకాలు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలో బీజేపీ ఇప్పటికే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించినా, తెలంగాణ విషయమై కేంద్ర నాయకత్వం కొన్ని కీలక అంశాల్లో ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ప్రముఖ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రామచంద్రరావుల పేర్లు పరిగణలోకి వచ్చాయి. అయితే కేంద్ర నాయకత్వం గణనీయంగా ఈటల రాజేందర్ వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. బీసీ (ముదిరాజ్) సామాజిక వర్గానికి చెందిన ఈటలను నియమిస్తే, ఆ వర్గానికి బీజేపీ దగ్గరవుతుందని పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో బీసీలు భారీ ఓటుబ్యాంకు కలిగి ఉండటంతో, ఇది వ్యూహాత్మకంగా బీజేపీకి లాభదాయకమవుతుందని విశ్లేషణ.
ఇకపోతే సీనియర్ నేత రామచంద్రరావు పేరు కూడా ఆరెస్సెస్ వర్గాల నుంచి సూచించబడినట్టు తెలుస్తోంది. కానీ ఆయన మృదుస్వభావి, తక్కువ దూకుడు కలిగిన నేతగా భావించబడటంతో, ఎన్నికల పోరులో ఆయన నాయకత్వం పెద్దగా ఫలితాలు ఇవ్వకపోవచ్చని భావించిన బీజేపీ కేంద్ర నాయకత్వం, ఆయన్ను గవర్నర్ పదవికి పరిశీలించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అధికార లక్ష్యంతో బీసీ కార్డు
తెలంగాణలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశాన్ని ఇప్పటికే సూచించిన నేపథ్యంలో, ఈటల ఎంపిక వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశాలున్నాయి. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ఆయన మళ్లీ పదవిలోకి రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలించనట్లే కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీకి అధ్యక్షుడి ఎంపిక కేవలం వ్యక్తిగత ఎంపిక కాదు. ఇది 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీకి బలమైన సామాజిక సపోర్టు, స్థానిక వ్యూహాలు, మరియు నిర్దిష్ట అభిముఖ్యతలపై ఆధారపడి ఉండే నేతను ఎంపిక చేయాలని అధిష్ఠానం యోచిస్తోంది. తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక పూర్తయిన తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిపి, అనంతరం జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. అందువల్ల రాష్ట్ర స్థాయి నియామకాలు కేంద్ర రాజకీయాలకు కీలక అడుగులు కావొచ్చు.
అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను గ్రామంలోని చిట్టచివరి కార్యకర్త నుంచి అతిముఖ్యమైన నాయకుడు వరకు కలిసి ఎన్నుకోవాలని చెబుతున్నారు. అలా జరగాలంటే అధ్యక్షుడి ఎంపికకు ఎన్నికలు నిర్వహించాలని, అలా నిర్వహిస్తేనే అధ్యక్షుడి ఎంపిక సబబు అని చెబుతున్నారు. మరి దీనిపై బీజేపీ అధినాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంతో చూడాలి మరి.