Saturday, November 15, 2025
HomeతెలంగాణRation Card : కార్డు వచ్చింది.. కానీ బియ్యం రావు... కొత్త రేషన్‌దారుల గోస

Ration Card : కార్డు వచ్చింది.. కానీ బియ్యం రావు… కొత్త రేషన్‌దారుల గోస

Technical glitches preventing new ration card holders : ఏళ్ల తరబడి ఎదురుచూపులు… ప్రజాపాలనలో దరఖాస్తులు… ఎన్నో ప్రదక్షిణల తర్వాత చేతికి కొత్త రేషన్ కార్డు! ఇక కడుపు నిండా బియ్యం వస్తాయని ఆశపడిన ఆ పేద కుటుంబాలకు చుక్కెదురవుతోంది. కార్డు చేతిలో ఉన్నా, డీలర్ వద్దకు వెళ్తే “మీ కార్డు ఇంకా అప్‌డేట్ కాలేదు, వచ్చే నెల రండి” అనే సమాధానం వారిని నిలువునా నీరుగారుస్తోంది. ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరు చేసినా, సాంకేతిక సమస్యలు, ఈ-కేవైసీ చిక్కులతో అర్హులైన లబ్ధిదారులకు బియ్యం అందడం లేదు. అసలు ఈ వింత సమస్యకు కారణమేంటి..? అధికారుల నిర్లక్ష్యమా, సాంకేతిక లోపమా..? ఈ చిక్కుముడి వీడేదెలా..?

- Advertisement -

ఏడేళ్ల నిరీక్షణ.. అయినా నిరాశే : ఈ సమస్య తీవ్రతకు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలానికి చెందిన ఏనుగ శిరీష ఉదంతమే నిదర్శనం. ఏడేళ్ల నిరీక్షణ ఫలించి, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోగా, నెల రోజుల క్రితం ఆమెకు కొత్త రేషన్ కార్డు మంజూరైంది. ఎంతో ఆనందంతో బియ్యం కోసం రేషన్ దుకాణానికి వెళ్తే, డీలర్ నుంచి ఊహించని సమాధానం. “మీ కార్డు ఇంకా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ కాలేదు, అందుకే బియ్యం రావు. వచ్చే నెల ప్రయత్నిద్దాం” అని చెప్పడంతో శిరీష నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఇది కేవలం శిరీష ఒక్కరి సమస్య కాదు, రాష్ట్రవ్యాప్తంగా వేలాది కొత్త కార్డుదారుల వ్యథ.

ఎందుకీ ‘అప్‌డేట్’ ఆలస్యం : ప్రభుత్వం జూన్‌లో మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసింది. ఆ తర్వాత కొత్తగా మంజూరైన కార్డుదారులకు సెప్టెంబర్ నుంచి బియ్యం ఇస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో ఒక సాంకేతిక నిబంధన లబ్ధిదారులకు శాపంగా మారింది.

25వ తేదీ నిబంధన: అధికారుల ప్రకారం, ప్రతి నెలా 25వ తేదీ లోపు కొత్తగా మంజూరైన కార్డుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తారు. వారికి మాత్రమే మరుసటి నెల నుంచి బియ్యం వస్తాయి. 25వ తేదీ తర్వాత అప్‌డేట్ అయిన వారికి, ఆ తర్వాతి నెల నుంచి బియ్యం అందుతాయి.

సమాచార లోపం: ఈ నిబంధనపై లబ్ధిదారులకు సరైన సమాచారం లేకపోవడంతో, కార్డు రాగానే బియ్యం వస్తాయని ఆశించి దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. “రాని వారు ఆందోళన చెందవద్దు, కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికీ బియ్యం వస్తాయి” అని సూర్యాపేట ఏఎస్‌వో శ్రీనివాస్‌రెడ్డి భరోసా ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది.

ఈ-కేవైసీ.. మరో పెద్ద చిక్కు : ‘అప్‌డేట్’ సమస్యతో పాటు, ‘ఈ-కేవైసీ’ (eKYC) ప్రక్రియ కూడా లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది.

బయోమెట్రిక్ తప్పనిసరి: బినామీలను ఏరివేయడానికి, కార్డులోని కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలతో బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలి.

ఆధార్ అప్‌డేట్ లేకపోతే..: చాలా మందికి, ముఖ్యంగా చిన్నారులకు, ఆధార్ కార్డులో బయోమెట్రిక్స్ అప్‌డేట్ కాకపోవడంతో, వారి వేలిముద్రలు ఈ-పాస్ యంత్రంలో నమోదు కావడం లేదు. దీంతో వారి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి కావడం లేదు. ఫలితంగా, వారు రేషన్ బియ్యానికి దూరమవుతున్నారు. ఆధార్ సెంటర్ల చుట్టూ, రేషన్ దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే వారి దినచర్యగా మారింది. ప్రభుత్వం వెంటనే ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ బియ్యం అందేలా చూడాలని, ఈ-కేవైసీ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad