Hyderabad-Manneguda highway expansion : ఏళ్లుగా అడ్డంకుల నడుమ నలిగిపోతున్న హైదరాబాద్ (అప్పా జంక్షన్) – మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణకు ఎట్టకేలకు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) పచ్చజెండా ఊపింది. దీంతో ఈ మార్గంలో అభివృద్ధికి మార్గం సుగమమైనట్లేనని అధికారులు భావిస్తున్నారు. అయితే, వందలాది మహా వృక్షాల భవితవ్యం, ప్రముఖుల ఒత్తిళ్ల ఆరోపణల నడుమ సాగిన ఈ వివాదంలో ఎన్జీటీ తీర్పుతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లేనా? లేక భవిష్యత్తులో భద్రతకు సంబంధించిన కొత్త ప్రశ్నలకు ఇది తావిస్తుందా? ఈ సుదీర్ఘ వివాదం వెనుక ఉన్న అసలు కథేమిటో చూద్దాం.
ప్రముఖుల ఒత్తిళ్లే శాపమాయెనా? రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ మార్గాన్ని 2016లో జాతీయ రహదారిగా (ఎన్‌హెచ్-163) అప్‌గ్రేడ్ చేసి, 2018లో భూసేకరణ ప్రారంభించారు. 46 కిలోమీటర్ల ఈ రహదారిలో మలుపులు అధికంగా ఉన్నందున, ప్రమాదాల నివారణకు ‘గ్రీన్‌ఫీల్డ్’ పద్ధతిలో (కొత్త మార్గంలో) రహదారి నిర్మించాలని తొలుత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భావించింది. అయితే, ఈ ప్రాంతంలో పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు చెందిన ఫాంహౌస్‌లు, విలువైన భూములు ఉండటంతో కథ అడ్డం తిరిగింది. గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మిస్తే తమ భూములు కోల్పోవాల్సి వస్తుందన్న ప్రముఖుల ఒత్తిళ్ల కారణంగానే, అధికారులు ప్రత్యామ్నాయాలను పక్కనపెట్టి, ప్రస్తుతం ఉన్న రెండు వరుసల మార్గాన్నే నాలుగు వరుసలుగా విస్తరించడానికి మొగ్గు చూపారనే విమర్శలు బలంగా వినిపించాయి.
మర్రిచెట్ల కోసం న్యాయపోరాటం ‘ ప్రస్తుత మార్గంలో విస్తరణ పనులు ప్రారంభం కాగానే, పర్యావరణవేత్తలు రంగంలోకి దిగారు. ఈ రహదారి వెంట సుమారు 915 పురాతన మర్రి వృక్షాలు ఉన్నాయని, వాటిని తొలగిస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ 2021లో ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో కేసు విచారణ చేపట్టిన ఎన్జీటీ, పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే, 2025 మార్చిలో సమర్పించిన నివేదిక సమగ్రంగా లేదని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. ఈలోగా ఎన్‌హెచ్‌ఏఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
ఎట్టకేలకు లైన్ క్లియర్.. కానీ : చివరకు, కొన్ని మర్రిచెట్లను శాస్త్రీయ పద్ధతిలో వేరేచోట నాటుతామని, మిగతా చెట్లను తొలగించకుండానే ఎలైన్‌మెంట్ ప్రకారం ముందుకు వెళ్తామని ఎన్‌హెచ్‌ఏఐ ఎన్జీటీకి విన్నవించింది. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ, అక్టోబరు 31న రహదారి విస్తరణ పనులను కొనసాగించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే, బలమైన ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ, పర్యావరణాన్ని, ప్రజాధనాన్ని కాపాడేలా ఎన్‌హెచ్‌ఏఐ తన వాదనలను బలంగా వినిపించలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విస్తరణలో కుదింపు.. ప్రమాదాలకు ముప్పు?
తాజా సమాచారం ప్రకారం, అధికారులు 150 మర్రిచెట్లను తొలగించి, మిగిలిన 765 చెట్లనుయథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే, మర్రిచెట్లు ఉన్న చోట నాలుగు వరుసల రహదారిని కుదించక తప్పదు. దీనివల్ల రోడ్డు విస్తరణ లక్ష్యం నీరుగారి, ఆయా ప్రాంతాలు మళ్లీ ప్రమాదాలకు నిలయాలుగా మారే ప్రమాదం ఉందని స్థానికులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


