NH-44 accident blackspots Telangana : ప్రయాణం సాఫీగా సాగాల్సిన రహదారి… ప్రాణాలు తీసే యమపాశంగా మారింది. వేగంగా దూసుకెళ్లాల్సిన వాహనాల చక్రాలకు పగ్గాలు వేస్తూ.. ఎందరో ప్రయాణికులను మృత్యుఒడికి చేరుస్తోంది. దేశంలోనే అత్యంత పొడవైన 44వ జాతీయ రహదారి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెత్తుటి మరకలతో నిండిపోతోంది. నిత్యం ఏదో ఒకచోట ఆర్తనాదాలు, రోడ్డుపై రక్తపు చారికలు.. ఇక్కడి ప్రజలకు పరిపాటిగా మారింది. అసలు ఈ మృత్యు మార్గానికి కారణాలేంటి? అధికారుల నిర్లక్ష్యమా? నిర్మాణంలోపమా? నిత్యం పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా.. ఎందుకు చర్యలు శూన్యం? ఈ ప్రమాదాల పరంపరకు అడ్డుకట్ట పడేదెప్పుడు..?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గుండా వెళ్లే 130 కిలోమీటర్ల 44వ జాతీయ రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. అతివేగం, అశాస్త్రీయ నిర్మాణం, అధికారుల అలసత్వం కలిసి ఈ రహదారిని ప్రమాదాలకు నిలయంగా మార్చేశాయి. గతేడాది రాష్ట్రంలో 26 వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ప్రమాదాలకు చిరునామా.. బ్లాక్ స్పాట్ల మయం : అధికారులు జరిపిన సర్వేలోనే ఈ 130 కిలోమీటర్ల పరిధిలో ఏకంగా 27 బ్లాక్ స్పాట్లు (అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు) ఉన్నట్లు తేలింది.
అశాస్త్రీయ కూడళ్లు: గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చే రోడ్లు నేరుగా జాతీయ రహదారిని కలిసే చోట ఎలాంటి సూచికలు, సిగ్నళ్లు, సర్వీస్ రోడ్లు లేవు. దీంతో గ్రామాల నుంచి ఒక్కసారిగా హైవేపైకి వచ్చే వాహనాలు, వేగంగా దూసుకొచ్చే భారీ వాహనాలను ఢీకొట్టి ప్రమాదాలకు గురవుతున్నాయి.
ప్రాణాలు తీస్తున్న యూ-టర్న్‌లు: ప్రధాన కూడళ్లు, యూ-టర్న్‌ల వద్ద జరుగుతున్న ప్రమాదాల్లోనే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సదాశివనగర్ మండలంలోని జంక్షన్లన్నీ బ్లాక్‌స్పాట్లుగానే మారాయి.
గోతులమయం.. ప్రాణాలకు గండం : ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ముఖ్యంగా క్యాసంపల్లి నుంచి భిక్కనూరు వరకు సుమారు 80కి పైగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రహదారి బాగుందన్న భ్రమతో వేగంగా వచ్చే వాహనదారులు, ఈ గుంతలను గమనించలేక అదుపుతప్పి ఘోర ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల జంగంపల్లి వద్ద స్కూటీని లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో నలుగురు మృతిచెందడం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.
కరువైన సూచికలు.. కానరాని పెట్రోలింగ్ : ఉమ్మడి జిల్లా పరిధిలోని 130 కిలోమీటర్ల మేర ప్రమాద హెచ్చరిక బోర్డులు మచ్చుకైనా కనిపించవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిచ్‌పల్లి వద్ద ఉన్న ప్రమాదకరమైన మూలమలుపు వద్ద గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా అధికారులు మేల్కోలేదు.
ప్రజల డిమాండ్లు: జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్లు నిర్మించాలని, గ్రామాలకు వెళ్లే చోట్ల పైవంతెనలు కట్టాలని ప్రజలు ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం శూన్యం.
విఫలమైన వ్యవస్థ: ప్రమాదాలు జరిగిన వెంటనే సహాయం అందించేందుకు గతంలో ఏర్పాటు చేసిన ‘హైవే పెట్రోలింగ్’ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు సాయం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారంటే ఈ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గుర్తించిన 27 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి. గుంతలు పడిన రహదారికి వెంటనే మరమ్మతులు చేయాలి. హెచ్చరిక బోర్డులు, సిగ్నళ్లు ఏర్పాటు చేసి, హైవే పెట్రోలింగ్ వ్యవస్థను పునరుద్ధరించాలి. లేనిపక్షంలో ఈ మృత్యుఘోష ఇలా కొనసాగుతూనే ఉంటుంది, మరెన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తుంది.


