Wildlife protection on national highways : రహదారి విస్తరణ అభివృద్ధికి మలుపు అయితే.. అదే మార్గం మూగజీవాల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. వేగంగా దూసుకొచ్చే వాహనాలకు అడవి జంతువులు బలవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ఈ విషాదాలకు అడ్డుకట్ట వేసేందుకు అటవీ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నడుం బిగించాయి. అసలు ఈ కంచెను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? దీని ప్రత్యేకతలేంటి..? ఈ చర్యతోనైనా వన్యప్రాణుల మరణాలు ఆగుతాయా..?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతం గుండా వెళ్లే 44వ జాతీయ రహదారి వన్యప్రాణుల పాలిట శాపంగా మారింది. అడవిని దాటి జనావాసాల్లోకి, రహదారులపైకి వస్తున్న చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వన్యమృగాలు వేగంగా వచ్చే వాహనాలను ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నాయి. గత 15 ఏళ్లలో ఈ మార్గంలో దాదాపు నాలుగు చిరుతలు మృత్యువాత పడగా, లెక్కలేనన్ని జంతువులు గాయపడ్డాయి. ఈ ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో, శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు అడుగులు వేశారు.
10 కిలోమీటర్ల రక్షణ కవచం: వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో, జాతీయ రహదారికి ఇరువైపులా ప్రత్యేకమైన రక్షణ కంచెను ఏర్పాటు చేస్తున్నారు.
ఎత్తు: జంతువులు సులభంగా దాటలేని విధంగా 6 అడుగుల ఎత్తుతో ఈ కంచెను నిర్మిస్తున్నారు.
పొడవు: రహదారికి ఇటువైపు 5 కిలోమీటర్లు, అటువైపు 5 కిలోమీటర్లు చొప్పున మొత్తం 10 కిలోమీటర్ల మేర ఈ ఫెన్సింగ్ ఉండనుంది.
“గత ఆరేళ్లలోనే 5 చిరుతలు, ఒక ఎలుగుబంటి వాహనాలు ఢీకొని చనిపోయాయి. రాత్రి వేళల్లో వాహనదారుల మితిమీరిన వేగమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం. మేం సైన్ బోర్డులు, వేగ నియంత్రణ సూచికలు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. అందుకే ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడి, శాశ్వత పరిష్కారంగా ఈ ఫెన్సింగ్ ఏర్పాటుకు సూచించాం,” అని ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ తెలిపారు.
సమన్వయంతోనే సంరక్షణ: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 86 వేల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ముఖ్యంగా 44వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, NHAI కంచె నిర్మాణ పనులను ముమ్మరంగా చేపట్టింది. ఈ చర్య పట్ల స్థానికులు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయంతో తీసుకున్న ఈ నిర్ణయం మూగజీవాల ప్రాణాలను కాపాడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కంచె ఏర్పాటుతో పాటు అటవీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు వాహనదారులు కూడా వేగ నియంత్రణ పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


