Sunday, November 16, 2025
HomeతెలంగాణAarogyasri : నిమ్స్ లో ఊపిరికి ఊరట... ఆరోగ్యశ్రీతో అరుదైన చికిత్స ఉచితం!

Aarogyasri : నిమ్స్ లో ఊపిరికి ఊరట… ఆరోగ్యశ్రీతో అరుదైన చికిత్స ఉచితం!

Whole Lung Lavage treatment at NIMS Hyderabad : తీవ్రమైన దగ్గు, ఆగని ఆయాసం… సాధారణ ఇన్‌ఫెక్షన్ అనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు ఎంతకీ తగ్గని ఈ లక్షణాల వెనుక మందులకు లొంగని ఒక అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి దాగి ఉండవచ్చు. దాని పేరే ‘పల్మనరీ అల్వియోలార్ ప్రొటినోసిస్’ (PAP). ఈ వ్యాధి సోకితే ప్రాణవాయువును అందించే ఊపిరితిత్తులే బరువెక్కి, శ్వాస తీసుకోవడం నరకప్రాయంగా మారుతుంది. దీనికి చికిత్స లక్షల ఖర్చుతో కూడుకున్నది కావడంతో సామాన్యులకు అందని ద్రాక్షలా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. హైదరాబాద్‌లోని నిమ్స్ (నిమ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిలో అత్యాధునిక ‘లంగ్స్ వాషింగ్’ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి ఈ ప్రాణాధార చికిత్సను పూర్తిగా ఉచితంగా అందించి పేద, మధ్యతరగతి రోగులకు కొండంత అండగా నిలుస్తున్నారు. ఇంతకీ ఏమిటీ పల్మనరీ అల్వియోలార్ ప్రొటినోసిస్..? ఊపిరితిత్తులను కడగటం అంటే ఏమిటి..? ఈ ప్రక్రియ ఎలా ప్రాణాలను కాపాడుతుంది..?

- Advertisement -

అసలేంటీ పల్మనరీ అల్వియోలార్ ప్రొటినోసిస్ (PAP) : మన ఊపిరితిత్తులలో లక్షలాది సూక్ష్మమైన గాలి సంచులు (అల్వియోలై) ఉంటాయి. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్‌ను రక్తంలోకి పంపే కీలకమైన పనిని ఇవే చేస్తాయి. ఈ గాలి సంచులను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడానికి ‘అల్వియోలార్ మాక్రోఫేజెస్’ అనే ప్రత్యేక కణాలు పనిచేస్తాయి. అయితే, కొన్నిసార్లు జన్యుపరమైన లోపాలు, ఆటో ఇమ్యూన్ సమస్యలు లేదా పర్యావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల ఈ కణాలు దెబ్బతింటాయి. దీని ఫలితంగా, గాలి సంచులలో ప్రోటీన్లు, కొవ్వులతో కూడిన జిగురు లాంటి పదార్థం పేరుకుపోతుంది.ఇది ఆక్సిజన్ సరఫరాకు అడ్డుకట్ట వేసి, శ్వాస తీసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. ఈ పరిస్థితినే పల్మనరీ అల్వియోలార్ ప్రొటినోసిస్ అంటారు.

వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి : ఈ వ్యాధి లక్షణాలు చాలా సాధారణంగా కనిపించడంతో రోగ నిర్ధారణ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. నిమ్స్ పల్మనరీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్. నరేంద్ర కుమార్ ప్రకారం, ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. ఛాతీలో నొప్పి, ఎడతెరిపి లేని దగ్గు చర్మం, గోళ్లు నీలం లేదా నల్లగా మారడం
తీవ్రమైన అలసట, నిస్సత్తువ లక్షణాలు.

“ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. చికిత్స ఆలస్యమైతే క్షయ, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది,” అని ప్రొఫెసర్ నరేంద్ర కుమార్ హెచ్చరించారు. ఆక్సిజన్ స్థాయి, పల్మనరీ ఫంక్షన్ పరీక్షలతో పాటు, ఛాతీ ఎక్స్-రే, సీటీ స్కాన్, బ్రాంకోస్కోపీ వంటి పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.

చికిత్సా విధానం: ఊపిరితిత్తులను ఎలా శుభ్రం చేస్తారు : పీఏపీకి ఇప్పటివరకు మందులు అందుబాటులో లేవు. దీనికి ఉన్న ఏకైక సమర్థవంతమైన చికిత్స ‘హోల్ లంగ్ లవాజ్’ (Whole Lung Lavage) లేదా ‘లంగ్స్ వాషింగ్’. ఇది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ.
రోగికి మత్తు ఇచ్చి, ఆపరేషన్ థియేటర్‌లో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఒక ప్రత్యేకమైన ట్యూబ్ ద్వారా ఒక ఊపిరితిత్తికి ఆక్సిజన్ అందిస్తూ, రెండవ ఊపిరితిత్తిలోకి స్టెరిలైజ్ చేసిన సెలైన్ వాటర్‌ను పంపిస్తారు. ఈ నీటితో గాలి సంచులలో పేరుకుపోయిన ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలను పూర్తిగా శుభ్రం చేసి, బయటకు తీస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.కొన్నిసార్లు, పరిస్థితిని బట్టి ఏడాది తర్వాత మళ్ళీ చేయాల్సి రావచ్చు.

నిమ్స్‌లో పేదలకు వరం: ఆరోగ్యశ్రీతో ఉచిత చికిత్స : లక్షల్లో ఖర్చయ్యే ఈ అత్యాధునిక చికిత్స ఇప్పటివరకు కేవలం కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైంది. ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో అందుబాటులోకి రావడమే కాకుండా, ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందిస్తుండటం ఎంతోమంది పేద రోగులకు ప్రాణదానంతో సమానం. “చాలా ఖరీదైన ఈ చికిత్సను ఇప్పుడు నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ఉంటే ఉచితంగా అందిస్తున్నాం. పీఏపీ సమస్యతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని ప్రొఫెసర్ ఎన్. నరేంద్ర కుమార్ తెలిపారు.ఈ చొరవతో, అరుదైన వ్యాధులకు సైతం ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యుత్తమ వైద్యం అందుతుందన్న భరోసా ప్రజలలో కలుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad