Thursday, September 19, 2024
HomeతెలంగాణNiranjan Reddy: ఎరువుల సబ్సిడీలో కేంద్రం పాత్ర శూన్యం

Niranjan Reddy: ఎరువుల సబ్సిడీలో కేంద్రం పాత్ర శూన్యం

ఎరువుల సబ్సిడీలో కేంద్రం పాత్ర శూన్యమంటూ భగ్గుమన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎరువుల సబ్సిడీపై కిషన్ రెడ్డి మాటలు అమాయకంగా, హాస్యాస్పదంగా ఉన్నాయంటూ నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఈ సబ్సిడీ కేంద్రం ప్రత్యేకంగా భరించదని, రాష్ట్రాల ఆదాయం మీదనే కేంద్రం మనుగడ సాగిస్తున్నదన్నారు ఆయన. కేంద్రానికి ప్రత్యేక కరెన్సీ లేదు, ప్రత్యేక ఆదాయమార్గాలు లేవని, కిషన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీలు భరించి ఎరువుల సబ్సిడీ ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి మాట్లాడారన్నట్టు ఆయన ఆరోపించారు.

- Advertisement -

దేశంలో హరిత విప్లవం మొదలయినప్పటి నుండి ఎరువులు సబ్సిడీ మీద ఇస్తున్నారని, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఎరువుల సబ్సిడీ తగ్గించి కోత విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన విఫల పథకమని, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా ఫసల్ భీమా అమలు చేయడం లేదు .. దీనికి తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రీమియం వసూలు ఎక్కువ ఇచ్చే పరిహారం తక్కువన్న నిరంజన్ రెడ్డి.. తెలంగాణలో రైతులకు ఉపయోగపడే పంటల భీమా పథకం తేవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వరసగా నాలుగేళ్లు సగటున ఏడాదికి రూ.600 కోట్లు ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన కోసం కట్టామని చెప్పుకొచ్చారు. 2400 కోట్లు భీమా కంపెనీలకు కడితే పరిహారంగా రైతులకు వచ్చింది కేవలం రూ.1800 కోట్లు మాత్రమే .. నాలుగేళ్లలో ఒక్క తెలంగాణ రూ.600 కోట్లు నష్టపోయింది .. ఈ పథకం కేవలం భీమా కంపెనీలకు మేలు చేసేది మాత్రమేనన్నారు.

భూమిని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, రైతాంగ శ్రేయస్సు సర్కారు లక్ష్యమన్నారు నిరంజన్ రెడ్డి. యాసంగి వరి సాగు సీజన్ నెల రోజులు ముందుకు జరగాలని, వ్యవసాయ అధికారులు రైతులకు బలంగా చెప్పి చైతన్యం చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలను మనం అడ్డుకోలేం .. అకాలవర్షాలు, వడగండ్ల వానలు రాకముందే పంటకాలం పూర్తయ్యేలా చూసుకోవాలన్నారు. ప్రతి రైతు తమ పొలాలకు భూసార పరీక్షలు చేయించుకోవాలని, నిపుణులు, శాస్త్రవేత్తల సూచనలు అనుగుణంగా ఎరువులు, రసాయనాలు వాడి పంట పెట్టుబడులు తగ్గించుకోవాలన్నారు. రైతు మనసుపెట్టి పనిచేస్తే ఆయనకు మించిన శాస్త్రవేత్త ప్రపంచంలో లేడని, వ్యవసాయ అనుకూల విధానాలతో రైతు ఆదాయం, రాష్ట్ర ఆదాయం పెంచి దేశాభివృద్ధి కి దోహద పడాలని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. దురదృష్టవశాత్తు కేంద్రంలోని ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో ముందుకుసాగుతున్నదని ఆరోపించిన మంత్రి.. పంటల సాగు విధానం ప్రస్తుత పద్దతుల ప్రకారం కొనసాగితే వందేళ్ల తర్వాత ఈ భూమి మీద ఒక్క పంట కూడా పండదు .. పంటలన్నీ విషతుల్యమవుతున్నాయి .. ప్రజలంతా అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు.

దేశంలో సగటున ఏడాదికి ఒకరు 6 కిలోలు మాంసం తింటుంటే .. తెలంగాణలో 24 కిలోలు తింటున్నారని, కేసీఆర్ తెలంగాణలో సాగునీటితో పాటు చెరువులలో ఉచితంగా చేప పిల్లలు, సబ్సిడీపై గొర్రెపిల్లలు, రైతులకు పంట పెట్టుబడి, పంటల కొనుగోళ్లు వందశాతం చేపడుతున్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఆహార శుద్ది కేంద్రాల ఏర్పాటుకు చర్యలు సిద్దం చేస్తున్నదని, భవిష్యత్ లో తెలంగాణలో 40 వరకు ఆయిల్ పామ్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని వివరించారు. రసాయనిక ఎరువులు తగ్గించి రైతులు సేంద్రియ ఎరువులు ఉపయోగించాలని హితవు పలికిన మంత్రి నిరంజన్ రెడ్డి.. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇందూ గార్డెన్ లో విశ్వ ఆగ్రోస్ మార్క్ ఫెడ్ గోల్డ్ సేంద్రీయ ఎరువులను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గారు, మార్క్ ఫెడ్ సభ్యులు విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News