తెలంగాణలో కరంటు కోత, కొరత ఉండదని, ప్రతి రెండు, మూడు గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నట్టు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నిరంజన్.. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగానిది కీలకపాత్ర అన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రతి చోట విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారన్నారు.
24 గంటల విద్యుత్ సరఫరా లేకుంటే పరిశ్రమలు, వర్తక, వాణిజ్యాలు, గృహావసరాలు, వ్యవసాయం మూలంగా కోట్లాది మందికి ఉపాధి లభించేది కాదని గుర్తు చేశారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, ఐటీ, పారిశ్రామిక, చేతివృత్తులలో ఉపాధి లభిస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో చేసిన పని ఇదంటూ చెప్పుకొచ్చారు. దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదని, తెలంగాణ దరిదాపులలో కూడా ఇతర రాష్ట్రాలు లేవన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగాన్ని బట్టే అంతగా ప్రజల అవసరాలు తీరుతున్నాయని, అన్ని పనులు జరుగుతున్నాయని అర్ధమన్నారు. అభివృద్ధి సూచికలో ప్రధానమైనది విద్యుతని, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలలో తక్కువ వర్షపాతం నమోదయిందన్నారు. అయినా వర్షాధార పంటలయిన పత్తి, మొక్కలకు ఎలాంటి ఇబ్బంది లేదని, నెల రోజులు ఈ సారి కాలం ఆలస్యమయింది .. రైతులు వ్యవసాయ అధికారుల సూచన మేరకు సాగుచేయాలన్నారు. ఆరుతడి పంటల సాగువైపు రైతులు దృష్టి సారించాలని, జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం, ఉప్పల గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులకు సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆర్ డి ఓ చంద్రకళ, డి ఈ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.