హైదరాబాద్ ఫ్యాప్సీ సురాన ఆడిటోరియంలో నిర్వహించిన ‘వ్యవసాయ- వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు – తెలంగాణ’ అంశంపై జరిగిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు అన్న కేంద్ర ప్రభుత్వ హామీ నినాదానికే పరిమితం అయిందని, 2022 పోయి 2023 సంవత్సరం వచ్చేసింది .. రైతుల ఆదాయం రెట్టింపు సంగతి పక్కనపెడితే రైతులకు సాగు పెట్టుబడి రెట్టింపు అయిందన్నారు. పంటల మార్కెటింగ్ అనేది రైతులకు ఇబ్బందికరంగా మారిందని, ఆహారం లేకుండా ప్రపంచం మనుగడ సాగించ లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యం కలిగిన రంగమని, సాగుకు భారతదేశ నేలలు, వాతావరణం అనుకూలమైనవన్నారు.
ప్రపంచ మార్కెట్ ఎగుమతులకు అనుగుణంగా ఎలాంటి నిబంధనలు అనుసరించాలో చైతన్యం చేయాలని, మనకు అత్యంత ప్రతిభ కలిగిన పరిశ్రమల శాఖా మంత్రిగా కేటీఆర్ ఉన్నారు .. ఒక మంచి పాలసీని ముందుకు తెస్తే అత్యంత తక్కువ సమయంలో దానిని అమల్లోకి తెచ్చే సత్తా ఆయనకు ఉందన్నారు. ప్రపంచానికి సాఫ్ట్ వేర్ సేవలు అందించడంలో భారత్ ముందున్నదని, ఒక్కరోజు దిగుమతులలో అంతరాయం ఏర్పడితే బ్రిటన్ ఆకలితో అల్లాడుతుందనే విషయాన్ని మంత్రు గుర్తుచేశారు. బ్రిటన్ ప్రపంచానికి ఏమీ ఎగుమతి చేయడం లేదు .. అన్నింటికి దిగుమతుల మీదే ఆధారపడుతుందని, మానవాళికి అవసరమైన దైనందిన అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రపంచంలో ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడడం అనివార్యమయిందన్నారు. వాణిజ్య ఒప్పందాలు లేకుండా దేశాలు మనుగడ సాగించడం అసాధ్యం .. అది లేకుండా జీవితం లేదన్నారు మంత్రి.
ఈ సదస్సుకు ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్, టీఎస్టీపీసీ జేఎండీ విష్ణువర్దన్ రెడ్డి, ఫిస్సీ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ సింఘాల్ తదితరులు హాజరయ్యారు.