ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలను వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ సర్కిల్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందుకు అవసరమైన వాటికి స్థలాలు కేటాయించాలని కలెక్టర్ ను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ & బి, విద్యుత్, ఆర్ డబ్లూ ఎస్ శాఖల ఎస్.ఈ కేంద్రాలను ఇప్పటి వరకు వనపర్తిలో ఏర్పాటు చేశామన్నారు.
వనపర్తి కేంద్రంగా ఇంజనీరింగ్ పనులు వేగంగా జరిగేందుకు ఇవి ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. ఉన్నత స్థాయి కార్యాలయాలు వనపర్తి జిల్లాలో ఉండటం వల్ల ఎక్కడికక్కడ పరిపాలనపరమైన నిర్ణయాలకు ఆస్కారం లభించిందన్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం తిరిగి వివిధ శాఖాధిపతుల వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుకు ఇది ఒక నిదర్శనం అని చెప్పారు. అలంపూర్ ఎమ్మెల్యే వీ.ఎం. అబ్రహం, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.