NIRF Rankings 2025 for agricultural universities : దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల ప్రతిష్టను నిర్ధారించే జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విజయఢంకా మోగించాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్’ (NIRF) – 2025 జాబితాలో తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) ఏకంగా 13 స్థానాలు ఎగబాకి సత్తా చాటింది. ఈ అద్భుతమైన ప్రగతి వెనుక ఉన్న వ్యూహాలేంటి..? అగ్రస్థానంలో నిలిచిన సంస్థకు సారథ్యం వహిస్తున్న తెలుగు తేజం ఎవరు..?
ర్యాంకుల రేసులో దూసుకెళ్లిన జయశంకర్ వర్సిటీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూదిల్లీలో విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గతేడాది 37వ స్థానం నుంచి ఈసారి 24వ స్థానానికి దూసుకెళ్లింది. దక్షిణాదిలోని వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల్లో 4వ స్థానంలో నిలిచి తన సత్తాను చాటుకుంది.
సంస్కరణల ఫలితం: గత పది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రవేశపెట్టిన వినూత్న సంస్కరణలే ఈ ఘనతకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
నవ్య పరిశోధన కేంద్రాలు: డిజిటల్ అగ్రికల్చర్, సహజ వనరుల యాజమాన్యం, సుస్థిర వ్యవసాయ వ్యవస్థలు, మానవ వనరుల అభివృద్ధి కోసం వర్సిటీ పరిధిలో నాలుగు ఆధునిక పరిశోధన కేంద్రాలను ప్రారంభించారు.
రైతు ముంగిట శాస్త్రవేత్తలు: ఈ వినూత్న కార్యక్రమం ద్వారా 1200 గ్రామాల్లో 1,20,000 మంది రైతులను శాస్త్రవేత్తలు నేరుగా కలిసి, రసాయన ఎరువుల వాడకం తగ్గింపు, నీటి యాజమాన్యంపై అవగాహన కల్పించారు. “వచ్చే ఏడాది టాప్ 10లో, 2027 నాటికి జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించడమే మా లక్ష్యం” అని వీసీ ప్రొఫెసర్ జానయ్య ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ వర్సిటీల ప్రతిభ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు—గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 31వ ర్యాంకును, పశ్చిమ గోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 40వ ర్యాంకును సాధించారు. అభివృద్ధి దిశగా ఇరు సంస్థలు తమ పనితీరును మెరుగుపర్చుకున్నాయి.
అగ్రపీఠంపై తెలుగు శాస్త్రవేత్త : ఈ ర్యాంకింగ్స్‌లో మరో విశేషం, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన న్యూదిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IARI)కు డైరెక్టర్‌గా ఓ తెలుగు శాస్త్రవేత్త, డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు ఉండటం. హైదరాబాద్‌లోని ‘నార్మ్’ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, ఏడాది క్రితమే ఐఏఆర్‌ఐలో బాధ్యతలు చేపట్టి, తనదైన సంస్కరణలతో సంస్థను దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టారు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఆయన ర్యాంకింగ్ సర్టిఫికెట్ అందుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణం.
ఆత్మపరిశీలన అవసరం : అయితే, టాప్ 40 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం మూడు విశ్వవిద్యాలయాలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వంటి సంస్థలు ఈ జాబితాలో కనిపించకపోవడం గమనార్హం. ఈ వర్సిటీలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


