సమీకృత కలెక్టరేట్, బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్ వరుణ్ రెడ్డి, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయం, కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని,హెలిప్యాడ్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… నిర్మల్ జిల్లా కేంద్రంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని అన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎల్లపల్లి గ్రామ శివారులోని క్రషర్ రోడ్ లో అనువైన స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, గత 9 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని మంత్రి తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతీ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనాలను నిర్మించారని చెప్పారు. సీయం కేసీఆర్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
జూన్ 2 వరకు అన్ని పనులు పూర్తి చేయాలని, సభకు వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల కోసం అవసరమైన మేర పార్కింగ్ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.