నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని పలు సరిహద్దు గ్రామాల్లో పెద్దపులి సంచారం చేస్తోంది. గత కొద్దిరోజులుగా పలు జంతువులపై దాడి చేసి చంపి వేయడం మూలంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
కుంటాల మండలం మేధన్పూర్, సూర్యాపూర్, అంబుగాం తదితర గ్రామాలు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి మహారాష్ట్ర నుంచి ప్రవేశించిన పెద్దపులి పలు జంతువులను చంపి వేసిందని ప్రజలు చెబుతున్నారు. సూర్య పూర్ గ్రామానికి చెందిన వడ్డే సాయన్న ఎద్దుపై, అలాగే లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందిన గేదెపై పులి దాడి చేయడంతో ఈ రెండు జంతువులు మృతి చెందాయి.
పులి సంచారాన్ని గమనించిన పశువుల కాపరి ఒకరు అందించిన సమాచారం మేరకు అటవీ అధికారులు ఈ ప్రదేశంలో గాలింపు చేపట్టారు. మొత్తం మూడు బృందాలుగా ఏర్పడ్డ అటవీ అధికారులు పరిశీలించి పులి అడుగులను కనుగొన్నారు. కెమెరా ట్రాకింగ్ తో పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు ఇదిలా ఉండగా బైంసా ఫారెస్ట్ రేంజ్ అధికారి వేణుగోపాల్ ప్రజలకు పలు సూచనలు చేశారు. అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గుంపులుగా శబ్దం చేస్తూ వెళ్లాలని పేర్కొన్నారు.