భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ(No Firecrackers) ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నందున, బాణాసంచా శబ్దాలు పేలుళ్ల శబ్దాలుగా భావించి ప్రజలు ఆందోళనకు గురై అవకాశం ఉందని తెలిపారు. అందుచేత బాణసంచా కాల్చడంపై నిషేధం విధించామని స్పష్టం చేశారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దేశ భద్రత దృష్ట్యా నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి ప్రజలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు.