Friday, April 11, 2025
HomeతెలంగాణRevanth Reddy: ప్రజలను వేధించే అధికారులపై వేటే

Revanth Reddy: ప్రజలను వేధించే అధికారులపై వేటే

డిస్కం డైరెక్టర్ కు ఉద్వాసన, ఎస్ఈపై బదిలీపై వేటు

ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

గురువారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు వచ్చింది. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరు..? తనిఖీ చేయాలని ఆర్డర్లు ఇచ్చింది ఎవరు…? అని సమీక్షలో ఉన్న ట్రాన్స్ కో సీఎండీ రిజ్విని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా.. లేదా.. అని ఆరా తీశారు.

సమావేశంలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పందించి.. రైతుల కరెంట్ కనెక్షన్ల తనిఖీ, సర్వే చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని సీఎంకు వివరించారు.

శాఖాపరమైన నిర్ణయమేదీ లేకుండానే డిస్కం డైరెక్టర్ (ఆపరేషన్స్) జె.శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చాడని, ఆయన ఆదేశాల మేరకు అక్కడున్న ఎస్ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలోనే డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలిగించామని, ఎస్ఐని అక్కడి నుంచి బదిలీ చేశామని ఉప ముఖ్యమంత్రి జరిగిన సంఘటనను మొత్తం వివరించారు.

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి చర్యలు తప్పవని, తమకు తోచినట్లు సొంత నిర్ణయాలు తీసుకొని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News