Telangana obesity public health crisis : ఒకప్పుడు అరుదుగా, అసహజంగా కనిపించే అధిక బరువు, ఇప్పుడు మన వంటింట్లోకి, మన పిల్లల ప్లేట్లలోకి చేరిపోయింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మన సమాజంపై ఓ నిశ్శబ్ద యుద్ధం ప్రకటించాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారన్న జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాలు, మన ఆరోగ్యంపై మోగుతున్న ప్రమాద ఘంటికలు. అసలు ఈ ఊబకాయం అనే మహమ్మారి మన సమాజంలోకి ఇంతలా ఎలా చొచ్చుకొచ్చింది? కేవలం ఆహారమే కారణమా? లేక దీని వెనుక మనం గమనించని జీవనశైలి విషాదం దాగి ఉందా? ఈ గండం నుంచి గట్టెక్కే మార్గమేంటి?
వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తున్న ఆధునిక సమస్య ఊబకాయం. ఒకప్పుడు సంపన్నుల వ్యాధిగా భావించే స్థూలకాయం, నేడు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అందరినీ ఆవహిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో నియంత్రణ లేని ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ కొరవడిన ఉద్యోగాలతో ఈ సమస్య మరింత జటిలమవుతోంది.
గణాంకాల గంటలు.. వాస్తవాల నివేదిక : కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (NFHS-5) ప్రకారం, రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం లేదా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది.
పట్టణాల్లోనే అధికం: గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో నివసించే వారిలోనే ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది.
పిల్లలే లక్ష్యం: యువతతో పోల్చితే పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో ఊబకాయం శాతం పెరగడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. భవిష్యత్ తరం అనారోగ్యాల బారిన పడుతుందనడానికి ఇది నిదర్శనం.
సంకల్పంతో సాధించారు: ఓ ఉపాధ్యాయురాలి విజయగాథ : సంకల్పం ఉంటే ఎంతటి సమస్యనైనా అధిగమించవచ్చని నిరూపించారు సిద్దిపేట ఇర్కోడు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీదేవి. 2020లో కరోనా బారినపడి ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు పౌష్టికాహారం పేరుతో ఎక్కువ ఆహారం తీసుకోవడంతో ఆమె బరువు ఏకంగా 75 కిలోలకు పెరిగింది. దీంతో మోకాళ్లు, నడుము నొప్పి, ఆయాసం వంటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, నిపుణుల సూచనలతో యోగా, నడకను దినచర్యలో భాగం చేసుకున్నారు. సమతుల ఆహారాన్ని పక్కాగా పాటిస్తూ, కేవలం ఏడాదిన్నర సమయంలో ఏకంగా 13 కిలోల బరువు తగ్గి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు.
వైద్యులు ఏమంటున్నారు? సమస్యకు మూలాలిక్కడే : “ప్రస్తుత తరం ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్‌ఫుడ్‌కు బానిసలయ్యారు. ఆహారంలో పిండి, కొవ్వు పదార్థాలు అత్యధికంగా ఉండటం సమస్యను రెట్టింపు చేస్తోంది,” అని మెదక్‌కు చెందిన జనరల్ సర్జన్, డా. పోకల సురేశ్ హెచ్చరించారు. “శారీరక శ్రమ దాదాపు శూన్యం. జీవన శైలిలో సానుకూల మార్పులు, ఒత్తిడిని జయించడం, సరైన సమయానికి పోషకాహారం తీసుకోవడం ద్వారానే ఈ సమస్యను అధిగమించగలం,” అని ఆయన స్పష్టం చేశారు.
అధిక బరువుతో అనారోగ్యాల కొండ : ఊబకాయం అనేది కేవలం శారీరక స్వరూపానికి సంబంధించిన సమస్య కాదు, అది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ముఖద్వారం.
జీవనశైలి వ్యాధులు: చక్కెర వ్యాధి (డయాబెటిస్), రక్తపోటు, పక్షవాతం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, కిడ్నీలో రాళ్లు.
క్యాన్సర్ ముప్పు: ఊబకాయం వల్ల పలు రకాల క్యాన్సర్ల బారినపడే ప్రమాదం ఉంది.
ఇతర సమస్యలు: శ్వాసకోశ సమస్యలు, కీళ్ల అరుగుదల, మానసిక ఆందోళన, నిద్రలేమి వంటివి సర్వసాధారణం.
గట్టెక్కే మార్గమిదే! ప్రభుత్వం, ప్రజల బాధ్యత : రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళా’ క్లినిక్‌ల ద్వారా అధిక బరువుతో బాధపడే మహిళలను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడం శుభపరిణామం. అయితే, వ్యక్తిగత స్థాయిలోనూ జీవనశైలిలో మార్పులు తప్పనిసరి.
వ్యాయామం: నిత్యం అరగంట సైకిల్ తొక్కడం, కనీసం ఐదు నిమిషాలు పరుగెత్తడం, వేగంగా నడవడం వంటివి అలవాటు చేసుకోవాలి.
ఆటలు, యోగా: ఆటలు ఆడటం, నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా మారవచ్చు.
ఆహార నియమాలు: నూనెలో వేయించిన, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. పీచుపదార్థాలు, పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

