Thursday, July 4, 2024
HomeతెలంగాణDelhi Liquor Scam: మరోసారి కవితకి సీబీఐ నోటీసులు.. అసలెందుకిలా?

Delhi Liquor Scam: మరోసారి కవితకి సీబీఐ నోటీసులు.. అసలెందుకిలా?

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-14లోని కవిత ఇంట్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 6.30 వరకు.. సుమారు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. కవితకు సీఆర్పీసీ 160 కింద జారీ చేసిన నోటీసు మేరకు ఈ స్కామ్‌లో సాక్షిగానే ఆమెను విచారిస్తున్నట్లు తెలియజేసిన సీబీఐ.. 40-50 ప్రశ్నలను సాధించినట్లు తెలిసింది.

- Advertisement -

కాగా, ఆదివారం విచారణ అనంతరం మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ సారి సీఆర్పీసీ 160 కింద కాకుండా… సీఆర్పీసీ 91 కింద సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 160 కింద అయితే విచారణ జరిపే వ్యక్తి ఇష్టానుసారం వారి నివాసంలో కేవలం ఒక సాక్షిగా మాత్రమే ప్రశ్నిస్తారు. సీఆర్పీసీ 91 కింద విచారణ అంటే… సీబీఐ చెప్పిన చోటుకు విచారణ నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది. విచారణ మరింత లోతుగా జరుగుతుంది.

అంతేకాదు, ఈ సీఆర్పీసీ 91 నోటీసుల కింద.. సాక్షి దగ్గర కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలున్నా.. తమకు సమర్పించాలని అధికారులు కోరే అవకాశం ఉంటుంది. ఒకవేళ అధికారులు అడిగిన ఆధారాలు ఉన్నట్టయితే.. ఇవ్వొచ్చు.. లేకపోతే లేవని చెప్పొచ్చు. అయితే.. సమర్పించిన ఆధారాలకు సంబంధించి అధికారులకు ఏమైనా సందేహాలుంటే మాత్రం మళ్లీ… నోటీసులిచ్చి విచారించే అవకాశం కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే.. అధికారులు అడిగిన ఆధారాలు.. సాక్షికి వ్యతిరేఖంగా ఉన్నట్టయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఈ కేసులో ఇరికించే విధంగా ఉన్న ఆధారాలను అడిగితే కవిత ఇబ్బందులలో పడాల్సి వస్తుంది. అలా కాకూడదు అంటే ఆమె కోర్టుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. సీబీఐ మళ్ళీ విచారణ ఎప్పుడు చేస్తారు.. ఎక్కడ చేస్తారు.. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News