PDS Rice: తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులు పౌరసరఫరాల శాఖ అలెర్ట్ ను జారీ చేసింది. జూన్ 30 లోపు మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని త్వరగా తీసుకోవాలని చెప్పింది. గడువు తర్వాత బియ్యం తీసుకోని వారికి సెప్టెంబర్ వరకు తిరిగి రేషన్ పొందే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
ఎందుకు ఈ గడువు?
కేంద్ర ప్రభుత్వం జూన్ 30 నాటికి మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. జూలై 1 నుంచి రేషన్ పంపిణీ ఉండదని కేంద్రం స్పష్టం చేయడంతో, తెలంగాణ ప్రభుత్వం ఈ ఆదేశాలను అమలు చేస్తోంది. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు మూడు నెలల రేషన్ అందుకున్నారు.
బియ్యం ఎక్కడ తీసుకోవాలి?
మీకు దగ్గర్లోని రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి మీ బియ్యాన్ని తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు మూడు నెలల రేషన్ తీసుకున్నారు.
రేషన్ కార్డు రద్దుపై హెచ్చరిక!
రేషన్ కింద తీసుకున్న బియ్యాన్ని ఎవరైనా అమ్ముకుంటే, వారి రేషన్ కార్డును రద్దు చేసే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.
సన్నబియ్యం పంపిణీకి అనూహ్య స్పందన:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. దీని ప్రకారం ఒక్కో లబ్ధిదారునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందుతోంది. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో సన్నబియ్యం ధర తగ్గడానికి కూడా దోహదపడింది.
ప్రభుత్వం అందిస్తున్న ఈ సన్న బియ్యానికి లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. బియ్యం తీసుకోవడం కోసం రేషన్ దుకాణాల వద్ద భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. గ్రామాల్లో పంపిణీ సాఫీగా సాగుతున్నప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది.
మీరు మీ మూడు నెలల రేషన్ బియ్యాన్ని తీసుకున్నారా? గడువు రేపటితో ముగుస్తుంది కాబట్టి వెంటనే వెళ్లి తీసుకోండి!