తెలంగాణలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఐదు క్యాటగిరీల వారీగా బ్యాంకు రుణాలతోపాటు కొంతమొత్తం సబ్సిడీని కల్పిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16,25,441 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా బీసీల నుంచి 5,35,666, ఎస్సీల నుంచి 2,95,908, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనార్టీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనార్టీల నుంచి 2,689 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు మండల ఆఫీసర్లు 70శాతం దరఖాస్తులను పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే ప్రతి దరఖాస్తును బ్యాంకు అధికారులు సైతం చెక్ చేయాల్సి ఉంది. దీంతో సిబిల్ స్కోర్ కీలకంగా మారనుంది. దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకర్లు లోన్ తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో ఏమైనా లోన్లు తీసుకుని కట్టకపోయి ఉంటే డిఫాల్టర్లుగా వారి అప్లికేషన్లను పరిగణలోకి తీసుకోరని సమాచారం. దీని ఆధారంగా చూసుకుంటే దాదాపు 40శాతం మంది అనర్హులుగా మిగిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగులు మాత్రం సిబిల్ స్కోర్ పరిగణననలోకి తీసుకోకుండా లోన్ మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.