Congress party focus booth level: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడటంతో అధికార పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టింది. అందులో భాగంగానే జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుల నియామకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది. అంతే కాకుండా ఈ సారి కొత్త వారికి పగ్గాలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యనేతల వారసులు, దగ్గరి బంధువులకు కూడా అవకాశం ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే మంచి ఫలితాలు వస్తాయని పార్టీ హైకమాండ్ అంచనా వేస్తోంది. ఇప్పటికే డీసీసీల నియామకం కోసం 22 మంది ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. వారిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ స్పీకర్లు వంటి ప్రముఖనేతలు ఉన్నారు. వారంతా ఈనెల 18 వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇప్పటికే ఆశావహులతో ముఖాముఖిగా ఏఐసీసీ పరిశీలకులు మాట్లాడారు.
కొత్త వారితోనే పార్టీకి జవసత్వాలు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయింది. అయినప్పటికీ పార్టీ బలోపేతం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కిందిస్థాయిలో పార్టీ నేతలు తీవ్ర నిరాశతో ఉన్నారు. అందుకే జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుల నియామకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో పార్టీ హైకమాండ్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి జవసత్వాలు రావాలంటే డీసీసీలను బలోపేతం చేయాలి. అంతే కాకుండా యువతకు పూర్తి బాధ్యతను అందించాలని పార్టీ పెద్దలు చూస్తున్నారు. అందుకే ఈ సారి కొత్త వారికి జిల్లా స్థాయి పగ్గాలు అప్పగించాలని కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో రాబోయే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు.
వారసులకు నో ఛాన్స్: డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్‌తోపాటుగా ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మంగళవారం సాయంత్రం జూమ్ మీటింగ్ నిర్వహించారు. పలు సూచనలు, ఆదేశాలను వారికి ఇచ్చారు. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునే వారు కనీసం 5 ఏండ్ల పాటు పార్టీలో క్రమశిక్షణతో పని చేసి ఉండాలని అన్నారు. పార్టీకి చేసిన సేవలు, రాజకీయ అనుభవం, ఇదివరకు పార్టీలో నిర్వహించిన పదవులు, బాధ్యతలు, పదవి ఇస్తే పార్టీకి ఏ విధంగా న్యాయం చేస్తారనే అంశాలతో కూడిన బయోడేటాను సేకరించాలని తెలిపారు. అలా లేని వారిని ఏఐసీసీ పరిశీలకులే తొలగిస్తారని టీపీసీసీ అధ్యక్షులు స్పష్టం చేశారు. యువతకు అవకాశం ఇచ్చే నేపథ్యంలో.. ప్రస్తుత డీసీసీ అధ్యక్షులకు రెండోసారి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ముఖ్యనేతల వారసులు, దగ్గరి బంధువులకు కూడా అవకాశం లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ.. సామాజిక న్యాయంతో జాబితా సిద్ధం అవుతుందని అన్నారు.


