Overseas Scholarship: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు) విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మరింత అవకాశాలను కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమలులో ఉన్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచింది. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 210 మంది విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందిస్తుండగా, తాజాగా ప్రభుత్వం ఈ సంఖ్యను 500కి పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులపై ఆసక్తి ఉన్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు అవసరమైన ఆర్థిక సహాయంతో తమ కలలను నిజం చేసుకునే అవకాశం పొందతారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్, పీజీ, పీహెచ్‌డీ లాంటి కోర్సులు అభ్యసించేందుకు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దోహదపడుతుంది.
ప్రస్తుతం పెరిగిన ఆసక్తి, విద్యార్థుల నుంచి వచ్చే భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సీట్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఈ పథకం ముఖ్య లక్ష్యం ఏంటంటే?.. సామాజికంగా వెనుకబడిన తరగతులకు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించడం, విదేశీ విద్యా అర్హతలతో అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసే సామర్థ్యం పెంపు, నిరుపేద ఎస్సీ విద్యార్థుల అకాడమిక్ కలలకు ఆర్థిక అండఇవ్వడం వంటివి.


