గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్న ఆలయాలతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో భక్తి భావం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో ముదిరాజ్ కులస్తుల ఇలవేల్పైన పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణం చేపట్టిన యాదాద్రి నేడు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పది ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా నిర్మించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామ గ్రామాన ఆలయాల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలందరిలో భక్తి భావం పెరిగి ఒకరి పట్ల ఒకరు స్నేహపూర్వక వాతావరణం అలవర్చుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ముదిరాజ్ కులస్తుల ఇలవేల్పైన పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి ప్రభుత్వపరంగా 15 లక్షల నిధులు మంజూరు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి, స్థానిక కౌన్సిలర్ బొంగోని వీరన్న, మారపల్లి బిక్షపతి, పిఎసిఎస్ చైర్మన్ కటంగూరి శ్రీకాంత్ రెడ్డి, పైడిపల్లి అంజన్న తదితరులు పాల్గొన్నారు.