కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజరాబాద్ అంబేద్కర్ చౌక్ నుంచి సిరసపల్లి క్రాస్ రోడ్ వరకు 2కే రన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించింది అన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో అమలు కావడం లేదన్నారు. 2కే రన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. దశాబ్ది ఉత్సవాలలో ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటూ కార్యక్రమాలను విజయవంతం చేయడం అభినందనీయం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అందులో భాగంగానే దివ్యాంగులకు మూడువేల ఉన్న పెన్షన్ ను 4 వేలకు పెంచడం జరిగిందన్నారు. అడగందే అమ్మయినా అన్నం పెట్టదనే నానుడిని మరిచిపోయేలా అడగక ముందే ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావలసిన సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం ఆయన పరిపాలన దక్షతకు నిదర్శనం అన్నారు.
2కే రన్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న అధికారులను, ప్రజాప్రతినిధులను, యువతను ఈ సందర్భంగా పేరుపేరునా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులతో పాటు జమ్మికుంట, హుజురాబాద్, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.