నాటి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్న భిన్నం కాగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు పునర్జీవనం పోసుకున్నాయని, అందుకే మిషన్ కాకతీయ పథకం దేశానికే ఆదర్శంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట, వీణవంక మండలాలతో పాటు హుజరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలలో చెరువుల పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ప్రతి గ్రామం నుంచి మహిళలు బతుకమ్మలు, బోనాలతో భారీ ర్యాలీగా చెరువు కట్టల వద్దకు తరలివచ్చి మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
నియోజకవర్గ పరిధిలో గ్రామ గ్రామాన ఎక్కడ చూసినా చెరువు కట్టలపై పండుగ వాతావరణం నెలకొంది. మహిళలందరూ ఒకచోట చేరి పండగ వాతావరణాన్ని తలపించేలా బతుకమ్మ ఆటలు, పాటలతో సందడి చేశారు ఈ సందర్భంగా హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలోని చెరువు కట్టలపై ఏర్పాటు చేసిన చెరువుల పండుగ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం తలపిస్తుంది అన్నారు. వ్యవసాయ రంగ పునర్జీవనం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర కార్యాచరణను అమల్లోకి తెచ్చారని, వ్యవసాయానికి ప్రాణాధారమైన సాగునీటి మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మిషన్ కాకతీయ పథకాన్ని అమలులోకి తెచ్చినట్లు చెప్పారు. సమైక్య పాలనలో చెరువుల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిందని, గంగాలాల వంటి చెరువులు పూడిక నిండి తాంబాలల్ల తయారయ్యాయని అన్నారు. చెరువులకు నవజీవనం తెచ్చే పథకంలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. చెరువుల పండుగను గ్రామ గ్రామాన ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకునేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన స్థానిక ప్రజా ప్రతినిధులను, అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.