రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి పై ప్రత్యేక దృష్టి సారించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హుజురాబాద్ పట్టణంలో సంక్షేమ సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దివ్యాంగులు, వయోవృద్ధులను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్ర పాలకులు దివ్యాంగులకు, వయోవృద్ధులకు చాలీచాలని పింఛన్లు ఇచ్చేవారని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల, వయోవృద్ధుల ఇబ్బందులను గుర్తించి ఆసరా పింఛన్ పేరుతో వయవృద్ధులకు 2 వేలు, దివ్యాంగులకు 3 వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. దీంతో వారు తమ తమ కుటుంబ సభ్యులపై ఆధారపడవలసిన అవసరం లేకుండా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు, వయోవృద్ధులకు అండగా నిలుస్తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లను అందిస్తూ వారి కళ్ళలో ఆనందాన్ని నింపుతున్న మహానుభావుడన్నారు. మన రాష్ట్రంలో ఇస్తున్న విధంగా దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా పింఛన్లను ఇవ్వడంలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గం అంటూ కాకుండా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుండడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట, హుజురాబాద్, ఇల్లందకుంట, కమలాపూర్, వీణవంక మండలాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆసరా పింఛన్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.