సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రభుత్వ పధకాల అమలు తీరుపై రెవిన్యూ అధికారులతో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సమావేశం నిర్వహించారు. సీతాఫల్మండీలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మారేడుపల్లి తాసిల్దార్ పద్మ సుందరి, ముషీరాబాద్ తాసిల్దార్ వెంకట లక్ష్మి, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మిలతో పాటు అధికారులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ లబ్దిదారుల ఎంపికలో పారదర్శక విధానాన్ని ప్రభుత్వం పాటిస్తోందని, ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని అయన హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలతో పేదలకు ఉపకరించే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతోందని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. అంబర్ నగర్ లో ఇళ్ళ స్థలాల క్రమబద్దీకరణతో పాటు రెవిన్యూ సమస్యలపై సమావేశంలో ఈ సందర్భంగా చర్చించారు.