Saturday, November 15, 2025
HomeTop StoriesLocal body elections: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. పంచాయతీరాజ్ కీలక ఆదేశాలు!

Local body elections: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. పంచాయతీరాజ్ కీలక ఆదేశాలు!

Panchayat Raj Department: స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్‌ మళ్లీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపైనే అంతర్గత చర్చలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అధికారులు, ఉద్యోగులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు సైతం జారీచేసింది. అయితే ఎన్నికలు ఎప్పుడు జరగొచ్చు అనే దానిపై మరో రెండుమూడు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుతోపాటు ఎన్నికల తేదీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలను జారీచేసింది. ఎన్నికలపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా..ఏర్పాట్లకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు: ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమస్యలు, చట్టపరమైన అంశాలపై ప్రభుత్వం కోరిన వివరణకు పంచాయతీరాజ్ శాఖ తన సమాధానాన్ని ఇప్పటికే పంపించినట్టు సమాచారం. అంతే కాకుండా ప్రభుత్వం పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే.. దానికి సంబంధించి రిజర్వేషన్ల ఖరారులో తప్పులు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేసిందని సమాచారం.

న్యాయస్థానాల ఆదేశంతోనే ముందస్తు చర్యలు: స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను కొట్టేయడంతో పాటుగా 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని గురువారం రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా హైకోర్టు సైతం శుక్రవారం ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు కీలక ఆదేశాలను జారీ చేసింది. రెండువారాల్లోగా స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలను తెలియజేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని పంచాయతీరాజ్ శాఖ భావిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించింది.

ఎన్నికల విషయంలో అస్సలు అలసత్వం వద్దు: హైకోర్టు ఆదేశాలతోనే పంచాయతీరాజ్ శాఖ అధికారులను ముందస్తుగా అలర్ట్ చేస్తుంది. అందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం జెడ్పీ సీఈవోలు, డీఆర్‌డీవోలు, డీపీవోలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్‌ వివిధ అంశాలపై అధికారలకు స్పష్టతనిచ్చినట్టు సమాచారం. రాష్ట్ర పభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే.. 50 శాతం మించకుండా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించినట్టు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సైతం ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమైనట్టు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad